రోడ్డు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన విఠల్ రెడ్డి
- ఝరి బి వంతెన స్థానంలో హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలి.
నిర్మల్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):తానూరు మండలంలోని ఝరి బి గ్రామంతో పాటు పలు గ్రామాలకు సంబంధించిన రోడ్డు సమస్యలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి తీసుకెళ్లారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న రహదారి సమస్యలను వివరించి, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను త్వరగా చేపట్టాలని కోరారు. భోల్సా నుంచి ఝరి బి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న లో లెవల్ వంతెన గత రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిని కూలిపోయిందని విఠల్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వంతెన కూలిపోవడంతో ఈ మార్గంలో రాకపోకలు స్తంభించాయని తెలిపారు. బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు గ్రామానికి చేరుకోలేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రులకు తరలించేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇప్పటికే రహదారి, వంతెన నిర్మాణానికి సంబంధించిన అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. కూలిపోయిన లో లెవల్ వంతెన స్థానంలో హై లెవల్ బ్రిడ్జిని నిర్మించి, భోల్సా–ఝరి బి రహదారిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని విఠల్ రెడ్డి కోరారు. వంతెన నిర్మాణం పూర్తయితే ఝరి బి, భోల్సా, వాడఝరి, ఝరి బి తండా గ్రామాలకు చెందిన ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. వర్షాకాలంలో రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా కుబీర్ మండలంలోని శివుని నుంచి శివుని తండా-2 వరకు రహదారి నిర్మాణ పనులు కూడా త్వరగా ప్రారంభించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తానూరు నుంచి మొగిలి గ్రామానికి వెళ్లే రహదారికి ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, పనులకు శంకుస్థాపన కూడా జరిగిందని తెలిపారు. అయినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.