విరిగిన స్తంభం…స్కూల్ దారిలో ముప్పు!
- ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోండి..!
- స్కూల్ పిల్లల దారిలో విరిగిన స్తంభం
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 6(ప్రజాక్షేత్రం):ఒక చిన్న ప్రమాదం ఇప్పుడు పెద్ద ముప్పుకు దారితీసే పరిస్థితిని సృష్టించింది. మినీ ట్రక్ ఢీకొనడంతో కరెంట్ స్తంభం విరిగిపోగా, విద్యుత్ వైర్లు వంగి ప్రమాదకరంగా మారింది. దీంతో సూరారం మరాఠీ బస్తి వాసులు ఆందోళన చెందుతున్నారు. డి. పోచంపల్లి సెక్షన్ పరిధిలోని సూరారం మరాఠీ బస్తి నుంచి కేవీఎం స్కూల్ వైపు వెళ్లే మార్గంలోని చిన్న గల్లీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మినీ ట్రక్ కరెంట్ స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం దెబ్బతిని విరిగిపోయింది. దీంతో విద్యుత్ వైర్లు కూడా వంగిపోయి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం నెలకొంది. ఈ దారి గుండా ప్రతిరోజూ స్థానికులు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా కేవీఎం స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు ఇదే మార్గాన్ని వినియోగిస్తుండటంతో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. చిన్నారులు, పాదచారులు ఈ దారిలో ప్రయాణించే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్థానికులు ఈ విషయాన్ని ఇప్పటికే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయినప్పటికీ ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం, వంగిపోయిన వైర్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
