prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 5:47 pm Digital Edition : PRAJA KSHETRAM

వెయ్యి రోజుల పాలనపై కుత్బుల్లాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ భారీ ధర్నా

వెయ్యి రోజుల పాలనపై కుత్బుల్లాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ భారీ ధర్నా

  • 420 అడుగుల బ్యానర్‌తో కాంగ్రెస్‌పై గులాబీ గర్జన..!
  • హామీలు అమలు చేసే వరకు పోరాటం ఆగదన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 02(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ సమర శంఖం పూరించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, కుత్బుల్లాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించాయి. 420 దొంగ హామీలకు ప్రతీకగా 420 అడుగుల భారీ బ్యానర్‌ను ప్రదర్శిస్తూ చేపట్టిన వినూత్న నిరసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా, కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. గులాబీ జెండాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కుత్బుల్లాపూర్ చౌరస్తా మార్మోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరించిందని ఆరోపించారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీలు వెయ్యి రోజులు గడుస్తున్నా ఎందుకు నెరవేరలేదని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా, మహిళలకు ఇచ్చిన హామీలు, యువతకు ఉద్యోగాల కల్పన, విద్యార్థులకు స్కూటీలు, విద్యాభరోసా కార్డులు, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అసలు సమస్యలపై సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. “తెలంగాణ ప్రజలను మోసం చేసిన హామీలపై ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందే. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం” అని కేపీ వివేకానంద్ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.