prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 8:37 pm Digital Edition : PRAJA KSHETRAM

శ్రీకృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణ జన్మాష్టమి

మేనమామ గండమని ఆకాశవాణి పలికెన్ –
ఆ మాట విని కంసుని గుండె రగిలెన్!
చరసాలే జన్మస్థానమై,
దేవకీ గర్భమున శ్రీహరి అవతరించెన్!

వసుదేవుని వెంట రేపల్లెకు పయనమై,
యశోదమ్మ ఒడిలో ఒదిగెను బాలుడై;
నందుని ఇంట నీలమేఘ శ్యాముడై,
బాలకృష్ణుడై అందరి మనసులు గెలిచెన్!

అమ్మలక్కల గోలతో వెన్నదొంగగా మారెన్,
చిలిపి చేష్టలతో అందరినీ మురిపించెన్;
మట్టి తిన్నాడని యశోదమ్మ మందలించగా,
చిట్టి నోటిలో జగమంతా చూపించెన్!

కాళీయుని పడగలపై నాట్యమాడి,
నాగమదమును అణచివేసి;
యమునా తీరాన దివ్యరూపమై,
మహావిష్ణు అవతారమని చాటెన్!

చిటికెన వేలితో గోవర్ధనమెత్తి,
గోవులనూ గోపాలులనూ కాపాడి;
గోవర్ధనధారియై కీర్తిని పొందెను,
గోపాలకృష్ణుడై వెలుగొందెను!

మురళీ గానంతో బృందావనం పులకించి,
రాధాకృష్ణుల ప్రేమ జగమంతా వెలిగించి;
ప్రేమకు, భక్తికి పరమార్థం చూపించి,
వేణుగాన లోలుడై రేపల్లెలో విరాజిల్లెన్!

కంసుని సంహరించి దుష్టశిక్షణ చేసి,
దేవకీ మాతకు పుత్రోత్సాహం నింపి;
ధర్మస్థాపనకై గీతామృతం పంచి,
జగద్గురువై లోకాన్ని నడిపెన్!

రచన:
శివ్వాం. కిరణ్ కుమార్
ప్రధానోపాధ్యాయులు
డి. ఏ. వి. పబ్లిక్ స్కూల్, అనకాపల్లి