prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:26 pm Digital Edition : PRAJA KSHETRAM

సంగారెడ్డిలో గణేశ్ నిమజ్జనం వేళ ఆరుగురు విద్యార్థుల మృతి..

సంగారెడ్డిలో గణేశ్ నిమజ్జనం వేళ ఆరుగురు విద్యార్థుల మృతి..

  • సంగారెడ్డి జిల్లాలో గణేశ్ నిమజ్జనంలో ఘోర విషాదం
  • చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థులు దుర్మరణం
  • మృతులంతా శిరీష అనాథాశ్రమానికి చెందినవారే
  • మృతదేహాలను పరిశీలించి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సంతాపం
  • పటాన్‌చెరులో అలుముకున్న విషాద ఛాయలు

పటాన్‌చెరు సెప్టెంబర్ 16(ప్రజాక్షేత్రం):వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని పెదకంజర్ల గ్రామ శివారులో ఉన్న నేరేడు చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం ఒక్కసారిగా విషాదమయమైంది. మృతులంతా శిరీష అనాథాశ్రమానికి చెందిన విద్యార్థులుగా గుర్తించారు.

శిరీష అనాథాశ్రమానికి చెందిన విద్యార్థులు గణేశ్ విగ్రహ నిమజ్జనం కోసం నేరేడు చెరువు వద్దకు వెళ్లారు. నిమజ్జనం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు వారు ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పటాన్‌చెరు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలించి విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనాథాశ్రమ నిర్వాహకులను పరామర్శించిన ఆయన, ఈ ఘటనపై తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతులను నర్సింహ రాజు, సుమంత్ (డిప్లొమా), గణేశ్ (డిప్లొమా), ఉదయ్ కిరణ్ (డిప్లొమా), శ్యామ్ కుమార్ (డిప్లొమా), సిద్ధార్థ్ (10వ తరగతి)గా గుర్తించారు. ఈ హృదయవిదారక ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా అన్ని చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.