prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 12:30 pm Digital Edition : PRAJA KSHETRAM

స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి!!

స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి!!

  • తాతా మధు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం!

హైదరాబాద్ సెప్టెంబర్ 07(ప్రజాక్షేత్రం):తెలంగాణ శాసనసభ వేదికగా ఈ రోజు అత్యంత ఉద్వేగభరితమైన సన్నివేశం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన కొన్ని వ్యాఖ్యలపై సభలో తీవ్ర చర్చ నడుస్తున్న సమయంలో.. శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ భావోద్వేగానికి గురై సభలోనే కంటతడి పెట్టుకున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్ తల్లిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడటం అత్యంత బాధాకరమంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ స్థానాన్ని, ఆయన తల్లిని అవమానించడంపై మంత్రి సీతక్క బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఆమె కూడా సభలోనే కన్నీరు పెట్టుకున్నారు. ఒక మహిళగా, మంత్రిగా సీతక్క అంతలా ఆవేదన చెందడం, సభలో కన్నీటి పర్యంతమవడం చూసి స్పీకర్ ప్రసాద్ కుమార్‌ సైతం తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. దీంతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అనంతరం ఈ గందరగోళం మధ్యే శాసనసభను కాసేపు వాయిదా వేశారు. సభ వాయిదా పడిన అనంతరం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మంత్రి సీతక్క గత ఐదేళ్లుగా నాకు సొంత అన్నలా భావించి రాఖీ కడుతున్నారు. అలాంటి సోదరి నా కోసం సభలో కన్నీరు పెట్టుకుంటే నాకు దుఃఖం ఆగలేదు, అందుకే భావోద్వేగానికి గురయ్యాను” అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికావన్న స్పీకర్.. తాతా మధు చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో ప్రత్యేక తీర్మానం చేసి, దానిని తదుపరి చర్యల నిమిత్తం శాసనమండలికి పంపిస్తామని స్పష్టం చేశారు.