prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 5:28 pm Digital Edition : PRAJA KSHETRAM

హామీల అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలి

హామీల అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలి

  • సెప్టెంబరు 10న ‘చలో హైదరాబాద్‌’ విజయవంతం చేయాలి.

హైదరాబాద్‌, సెప్టెంబరు 06(ప్రజాక్షేత్రం):ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ సహకార గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏ.జగన్మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి డా.డి.భీంరాజ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

గచ్చిబౌలిలోని టీఎన్జీవోల కాలనీ ఆత్మీయ భవన్‌లో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ హామీలు, పెండింగ్‌ డిమాండ్లపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యం వీడి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

  • రెండో వేతన సవరణ సంఘం అమలు చేయాలి.

రెండో వేతన సవరణ సంఘం నివేదికను వెంటనే సమర్పించి 42 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 2023లో ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా మూడేళ్లు గడిచినా నివేదిక రాకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వేతన సవరణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

  • ఆరు విడతల కరవుభత్యం విడుదల చేయాలి.

ఉద్యోగులకు రావాల్సిన ఆరు విడతల కరవుభత్యం బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. 2024 జనవరి, జులై.. 2025 జనవరి, జులై.. 2026 జనవరి, జులైకు సంబంధించిన బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

  • వైద్య పథకాన్ని సమర్థంగా అమలు చేయాలి.

ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ఆసుపత్రులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి చెల్లింపులపై స్పష్టత ఇవ్వాలని తెలిపారు.

  • బకాయి బిల్లులు విడుదల చేయాలి.

ఉద్యోగులు, పింఛనుదారులకు సంబంధించిన బకాయి బిల్లుల పరిష్కారానికి ప్రస్తుతం విడుదల చేస్తున్న నిధులు సరిపోవడం లేదన్నారు. ప్రతి నెల రూ.2 వేల కోట్ల మేర బకాయి బిల్లులు విడుదల చేసి.. ఉద్యోగులు, పింఛనుదారులకు చెరో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

  • పాత పింఛను విధానం పునరుద్ధరించాలి.

దోహద పింఛను విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. 2004 సెప్టెంబరు 1కు ముందు నోటిఫికేషన్‌ ద్వారా నియామక ప్రక్రియలోకి వచ్చిన ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.

  • ఉద్యోగ సంఘాల గుర్తింపు పునరుద్ధరించాలి.

పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ సంఘాల గుర్తింపును వెంటనే పునరుద్ధరించాలని కోరారు. సంఘాల ప్రధాన బాధ్యులకు కల్పించిన 21 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు సౌకర్యంతోపాటు బదిలీల సమయంలో సంఘాల కార్యవర్గ సభ్యులకు ఉన్న మినహాయింపు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

  • చలో హైదరాబాద్‌కు భారీగా తరలిరావాలి.

ఇప్పటికే ఆగస్టు 27న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష నిర్వహించినా ప్రభుత్వం తగిన స్పందన చూపలేదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ హామీల అమలు కోసం సెప్టెంబరు 10న నిర్వహించే ‘చలో హైదరాబాద్‌’కు అన్ని శాఖల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని జగన్మోహన్‌రావు, భీంరాజ్‌ పిలుపునిచ్చారు. ఉద్యోగుల ఐక్యతను చాటుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

తెలంగాణ సహకార గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏ.జగన్మోహన్‌రావు
తెలంగాణ సహకార గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డా.డి.భీంరాజ్‌