prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 5:24 pm Digital Edition : PRAJA KSHETRAM

ఓట్ల హక్కు హరిస్తే సహించం

ఓట్ల హక్కు హరిస్తే సహించం

  • సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై కాంగ్రెస్‌ నేతల ధ్వజం
  • ఓట్ల తొలగింపుపై పారదర్శకత పాటించాలని డిమాండ్‌
  • వనపర్తి కలెక్టరేట్‌ ఎదుట ‘ఎలక్షన్‌ చోర్‌ ఆఫ్‌ ఇండియా’ నిరసన

వనపర్తి, సెప్టెంబరు 28(ప్రజాక్షేత్రం):అర్హులైన ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడాన్ని అడ్డుకోవాలని, ఓటు హక్కు పరిరక్షణకు ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు ఆరోపణలు చేస్తూ.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపు, టీపీసీసీ ఆదేశాల మేరకు సోమవారం వనపర్తి సమీకృత కలెక్టరేట్‌ ఎదుట ‘ఎలక్షన్‌ చోర్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు శివసేనరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు.

జ్ఞానేశ్‌కుమార్‌ను అరెస్టు చేయాలి

డీసీసీ అధ్యక్షుడు శివసేనరెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ బాధ్యత వహిస్తున్నారని విమర్శించారు. ఓట్ల చోరీకి సూత్రధారిగా వ్యవహరించిన జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే అరెస్టు చేసి, పదవి నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఎన్నికల కమిషన్‌లోనే విభేదాలు బయటకు వస్తున్నట్లు వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్‌ సంధు, వివేక్‌ జోషీలు గత పది నెలల్లో 14సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికలను ప్రస్తావించారు. దీంతో ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో మరిన్ని సందేహాలు నెలకొంటున్నాయని పేర్కొన్నారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫామ్‌-6 ప్రక్రియను కూడా క్లిష్టతరం చేస్తున్నారని ఆరోపించారు. కొత్త ఓటర్ల నుంచి తల్లిదండ్రులు, తాతముత్తాతలకు సంబంధించిన వివరాలు కోరడం ద్వారా యువతను ఓటు నమోదు నుంచి దూరం చేసే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కు అని, దాని పరిరక్షణకు కాంగ్రెస్‌ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఎన్నికలొస్తే కాంగ్రెస్‌దే గెలుపు,పొంగులేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీదే విజయమని అన్నారు. ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మొదటి నుంచీ ఆధారాలతో ప్రజెంటేషన్లు ఇస్తున్నారని తెలిపారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పేరుతో ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెలువడుతున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై చర్యలు తీసుకుని, పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా పనిచేయాలని అన్నారు.

‘బీజేపీ కండువా కప్పుకోండి’: వాకిటి శ్రీహరి

మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. బీజేపీయేతర పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లను చీల్చి రాజకీయ లబ్ధి పొందేందుకే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో అర్హులైన ఓటర్లను లక్ష్యంగా చేసుకుని పేర్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. దశాబ్దాలుగా ఓటు హక్కు ఉన్న వారి పేర్లను సైతం జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘‘ఒకసారి రాముడి పేరుతో.. మరోసారి అక్షింతలతో.. ఇప్పుడు ఓటర్ల జాబితాతో’’ అంటూ బీజేపీపై విమర్శలు చేశారు. ప్రజల చేతిలో ఉన్న ఓటు అనే వజ్రాయుధాన్ని లాక్కునే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.
ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాకుండా ఓటర్ల హక్కులకు కాపలాదారుగా వ్యవహరించాలని కోరారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను ఉద్దేశించి ‘‘ఇక బీజేపీ కండువా కప్పుకోండి’’ అంటూ వ్యాఖ్యానించారు. అర్హత ఉన్న ఒక్క ఓటును కూడా తొలగించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తే సహించం: జూపల్లి

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే చర్యలను సహించబోమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారంటూ రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. దేశాన్ని ఎన్నో రాజకీయ పార్టీలు పాలించినప్పటికీ రాజ్యాంగ సంస్థలను బలహీనపర్చలేదని అన్నారు. రాజ్యాంగ సంస్థలను దెబ్బతీయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఓట్ల తొలగింపు ఆరోపణలను అడ్డుకునేందుకు మరిన్ని ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఓట్ల ద్వారానే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయని, ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

జ్ఞానేశ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేయాలి: మేఘారెడ్డి

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు సక్రమంగా విధులు నిర్వర్తిస్తుండగా, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రక్రియను అడ్డుపెట్టుకుని ఓట్లను తొలగిస్తూ మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.
జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సంఘంలో పారదర్శకతను కాపాడేందుకు కొత్త సభ్యులను నియమించాలని కోరారు. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల కమిషన్‌ నియామకాల్లో పారదర్శకత పాటించాలని, సుప్రీంకోర్టు సూచించిన విధానాలకు అనుగుణంగా వ్యవహరించాలని కోరారు. ప్రజల ఓటు హక్కుకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. భారీగా పాల్గొన్న కాంగ్రెస్‌ శ్రేణులు
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, జిల్లా కమిటీ ఉపాధ్యక్షలు ధనలక్ష్మి, సాయిచరణ్‌రెడ్డి, జనార్దన్‌సాగర్‌, కోళ్ల వెంకటేష్‌, బి.కృష్ణ, మున్సిపల్‌ చైర్మన్‌ మాధవి, వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, సత్యశిలారెడ్డి, మండల అధ్యక్షుడు నక్క రవికిరణ్‌, పట్టణ అధ్యక్షుడు రాములు, రామ్‌రెడ్డి, నరహరి, కృష్ణయాదవ్‌, దయాకర్‌రెడ్డి, విష్ణుముదిరాజ్‌, కౌన్సిలర్లు మహేశ్వరి, విజయలక్ష్మి, యువజన కాంగ్రెస్‌ నాయకులు పాండుసాగర్‌, శివకుమార్‌ నాయుడు, యాదగిరి, అరవింద్‌నాయక్‌, తిరుపతినాయక్‌, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్‌, కోట్ల రవి, జిల్లా మైనార్టీ నాయకుడు అయూబ్‌ఖాన్‌, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, మహిళా జిల్లా అధ్యక్షురాలు శ్రీలతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.