కాలువలోకి దూసుకెళ్లిన ప్రైవేటు పాఠశాల బస్సు
- విద్యార్థులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం..
- భద్రతపై అధికారుల దృష్టి సారించాలని స్థానికుల డిమాండ్
శంకర్ పల్లి సెప్టెంబర్ 03(ప్రజాక్షేత్రం):టంగుటూరు–మోకిలా ప్రధాన రహదారిపై ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. బస్సు ఒకవైపు ఒరిగిపోయి మట్టిలో ఇరుక్కుపోయింది. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. రహదారిపై వెళ్తున్న సమయంలో బస్సు అదుపుతప్పడంతో పక్కకు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాలువలోకి వెళ్లిన బస్సు మట్టిలో ఇరుక్కుపోవడంతో అక్కడే నిలిచిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు బస్సులో ఉండి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలకు విద్యార్థులను తీసుకెళ్లే బస్సుల విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని వారు కోరుతున్నారు. బస్సుల సాంకేతిక పరిస్థితి, బ్రేకులు, టైర్లు, వేగ నియంత్రణ, డ్రైవర్ల నైపుణ్యం వంటి అంశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి నిబంధనలు పాటించని పాఠశాల బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.