సొసైటీ అభివృద్ధి, రైతుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం
- ఎత్తోండ సొసైటీ నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు
- ఎత్తోండ పీఏసీఎస్ చైర్మన్‌గా కోనేరు వెంకట సుబ్బారావు బాధ్యతల స్వీకరణ
- చైర్మన్ కు బాధ్యతలు అప్పగించిన పర్సన్ ఇన్ఛార్జ్ యండి.రియాజుద్దీన్
కోటగిరి, అక్టోబర్ 06(ప్రజాక్షేత్రం):సొసైటీ అభివృద్ధి రైతుల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని ఎత్తొండ సొసైటీ నూతన అధ్యక్షుడు కోనేరు వెంకట సుబ్బారావు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం మంగళవారం బాధ్యతలు చేపట్టింది. సంఘ చైర్మన్ గా కోనేరు వెంకట సుబ్బారావును ప్రభుత్వం నియమించడంతో ఆయనకు సొసైటీ పర్సన్ ఇన్ ఛార్జ్ రియాజుద్దీన్ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సంఘం నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావుతో పాటు పాలకవర్గ సభ్యులుగా కమలావార్ వెంకటేష్, మన్నె సాయిలు, అగ్గు హనుమంతు, మేతరి లస్మవ్వ, బొనిగే శ్యాంసుందర్, ఆలపాటి లక్ష్మి, జి. సరస్వతి, జి.తుక్కమ్మ, ఆర్.రాధిక, బోధన్ ఆనంద్, ఎం. ఫణికుమార్, హెచ్.అశోక్ బాధ్యతలు స్వీకరించారు. సంఘం పరిధిలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సహకార సంఘం సిబ్బంది, సంఘ సభ్యులు నూతన పాలక వర్గానికి శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గత కొంతకాలంగా సంఘం పర్సన్ ఇన్ ఛార్జ్‌గా సేవలందించిన సహకార శాఖ అధికారి యండి.రియాజుద్దీన్‌ను నూతన పాలకవర్గ సభ్యులు శాలువా, పూలమాలలతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ….రైతు బాగుంటేనే సొసైటీ బాగుంటుందనే సిద్ధాంతంతో తమ పాలక వర్గం పనిచేస్తుందని అన్నారు. సొసైటీ అభివృద్ధి రైతుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం గా పని చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎత్తోండ మాజీ సర్పంచ్ ఆనంద్ మాట్లాడుతూ…సంఘం ద్వారా రైతులకు అందవలసిన సేవలు, రుణాలు, ఎరువులు, విత్తనాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని నూతన పాలకవర్గాన్ని కోరారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.బాన్సువాడ ఎమ్మెల్యే,తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో ఎత్తొండ సహకార సంఘాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి లాభాల బాటలో నడిపించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హమీద్ పాల్గొని నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావును శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘ పరిధిలోని సర్పంచులు రొట్టె పుష్పభాయి విఠల్ పటేల్, షేక్.గౌస్, గైని వీరమణి అర్జున్, బి.అనిత చందు, సొసైటీ సెక్రెటరీ రాజశేఖర్, ప్రజా ప్రతినిధులు, సంఘ సభ్యులు, రైతులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
