prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 6:39 pm Digital Edition : PRAJA KSHETRAM

“నా భూమిలోకి నన్నే వెళ్లనివ్వడం లేదు” — మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ ఆవేదన

“నా భూమిలోకి నన్నే వెళ్లనివ్వడం లేదు” — మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ ఆవేదన

  • ప్రభుత్వ భూమి మీదుగా తన భూమికి వెళ్తుండగా అడ్డుకున్నారంటూ ఆరోపణలు..
  • ఎస్టీ వ్యక్తి హక్కులను అడ్డుకుంటే చట్టపరమైన పరిణామాలు తప్పవు” అని హెచ్చరిక

శంకర్‌పల్లి, అక్టోబర్ 08(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన పులకండ్ల మల్లారెడ్డి, తండ్రి రుక్కారెడ్డి తన భూమిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని పొన్నగుట్ట తండా మాజీ సర్పంచ్, ఎస్ టి వర్గానికి చెందిన శంకర్ నాయక్ ఆరోపించారు. శంకర్ నాయక్‌కు ప్రొద్దుటూరు పరిధిలోని సర్వే నంబర్ 650లో భూమి ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే సర్వే నంబర్ 29కు సంబంధించిన భూమి అంశాన్ని కారణంగా చూపుతూ, అక్టోబర్ 7, 2026న తాను తన భూమిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో పులకండ్ల మల్లారెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. తాను మల్లారెడ్డి వ్యక్తిగత భూమి మీదుగా వెళ్లడం లేదని, తన భూమికి వెళ్లే మార్గం ప్రభుత్వ భూమి మీదుగా ఉందని శంకర్ నాయక్ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమి మీదుగా తన భూమికి వెళ్లే సమయంలో తనను అడ్డుకోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ఎవరి వ్యక్తిగత భూమిలోకి వెళ్లడం లేదు.. ప్రభుత్వ భూమి మీదుగా నా భూమికి వెళ్తున్నాను. అయినప్పటికీ నన్ను అడ్డుకోవడం ఏ న్యాయం?” అని శంకర్ నాయక్ ప్రశ్నించారు. తనకు చట్టబద్ధంగా ఉన్న హక్కులను వినియోగించుకునే అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. తాను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తినని, తన హక్కులను అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే వాటిపై చట్టపరమైన చర్యలకు తాను వెనుకాడబోనని శంకర్ నాయక్ తెలిపారు. ఒక ఎస్టి వ్యక్తి చట్టబద్ధమైన హక్కులను అడ్డుకుంటే, దాని వల్ల చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చని ఆయన హెచ్చరించారు. అయితే ఈ వ్యవహారంలో వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉందని, సర్వే నంబర్లు 29, 650కు సంబంధించిన రెవెన్యూ రికార్డులను అధికారులు సమగ్రంగా పరిశీలించి, భూముల సరిహద్దులు మరియు రాకపోకల మార్గాన్ని అధికారికంగా సర్వే చేయాలని శంకర్ నాయక్ డిమాండ్ చేశారు.