గంజాయి విక్రయానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్
- 430 గ్రాముల ఎండు గంజాయి, రెండు సెల్ఫోన్లు, స్కూటీ స్వాధీనం
మొయినాబాద్, అక్టోబర్ 14(ప్రజాక్షేత్రం):గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 430 గ్రాముల ఎండు గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఎలక్ట్రానిక్ తూకం యంత్రం, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామంలోని శ్మశానవాటిక వద్ద గంజాయి విక్రయించేందుకు ఓ వ్యక్తి వస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించి, పంచ సాక్షులు, క్లూస్ టీమ్ సహకారంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం సుమారు 12.10 గంటలకు శ్మశానవాటిక వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిని అంతంగారి అరుణ్ కుమార్‌గా గుర్తించారు. విచారణలో బీదర్ ప్రాంతానికి చెందిన హుస్సేన్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి, మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో తన స్నేహితులకు, ఇతరులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 430 గ్రాముల ఎండు గంజాయి, గంజాయి ప్యాకింగ్‌కు ఉపయోగించే ప్యాకెట్లు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రం, రెండు మొబైల్ ఫోన్లు, టీఎస్12ఈబి8065 రిజిస్ట్రేషన్ నంబరు గల స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను పంచ సాక్షుల సమక్షంలో ప్యాక్ చేసి సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.