prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 1:56 am Digital Edition : PRAJA KSHETRAM

పెద్దేముల్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు!

  • గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా పూల పండుగ
  • తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
  • పెద్దేముల్ సర్పంచ్ డివై. నర్సింహులు,మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడు డివై.ప్రసాద్

పెద్దేముల్, అక్టోబర్ 18(ప్రజాక్షేత్రం):తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను పెద్దేముల్ మండల కేంద్రంలో ఆదివారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు, యువతులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ,ఆటపాటలతో సందడి చేశారు.దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా పెద్దేముల్ గ్రామ సర్పంచ్ డివై.నర్సింహులు, మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడు డివై.ప్రసాద్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, ప్రకృతిపై మనకున్న ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.పూలను పూజిస్తూ ప్రకృతిని గౌరవించే గొప్ప సాంప్రదాయం బతుకమ్మ పండుగలో అంతర్లీనంగా ఉందన్నారు.తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. బతుకమ్మ వేడుకలు మహిళల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని వారు పేర్కొన్నారు.ఇలాంటి పండుగలను గ్రామస్థులందరూ కలిసికట్టుగా నిర్వహించుకోవడం ద్వారా సామాజిక ఐక్యత,సోదరభావం మరింత బలపడతాయని అన్నారు.గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజలు, మహిళలు పండుగల్లో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని తెలిపారు.సాంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకల్లో మహిళలు,యువతులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పండుగ వైభవాన్ని చాటిచెప్పారు. తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్దేముల్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు,మహిళలు, యువకులు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.