- 17 వేల మంది ఉద్యోగుల సమస్యలు పట్టించుకోరా?
- 14 రోజులుగా సమ్మె చేస్తున్నా స్పందన కరువు
- ఉద్యోగ భద్రత, పే స్కేల్, ఆరోగ్య బీమా కల్పించాలి
- ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
తెలంగాణ బ్యూరో అక్టోబర్ 26(ప్రజాక్షేత్రం):మెడికవర్ ఆస్పత్రులను కాపాడటంపై ఉన్న శ్రద్ధ జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులను ఆదుకోవడంపై ఎందుకు లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలను కాపాడే 17 వేల మంది ఉద్యోగులు 14 రోజులుగా సమ్మె చేస్తున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెలో పాల్గొని ఆయన మద్దతు తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని అన్నారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జీతాలు పెంచి ఉద్యోగులను ఆదుకున్నారని, ప్రస్తుత ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవడం లేదని విమర్శించారు.
ఉద్యోగ భద్రత ఏదీ?
జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, పే స్కేల్, ఆరోగ్య బీమా, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించడం లేదని ప్రవీణ్‌కుమార్ అన్నారు. ప్రసూతి సెలవులు కూడా అమలు కాకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లోనే కాకుండా ప్రైవేటు సంస్థల్లోనూ ప్రసూతి సెలవులు కల్పిస్తున్నారని, ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ఆ సదుపాయం లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లుగా ఉన్నప్పుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రూ.100 కోట్లు కేటాయించలేరా అని నిలదీశారు. 17 వేల మంది ఉద్యోగులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు సుమారు రూ.17 కోట్లు సరిపోతాయని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం కంటే ఇతర నిర్మాణాలు, ఖర్చులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు.
ఆరోగ్య రంగంలో కీలక సేవలు
జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు తెలంగాణను ఆరోగ్య రంగంలో దేశంలో 11వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకొచ్చారని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను 31 శాతం నుంచి 70 శాతానికి పెంచడంతోపాటు మాతా, శిశు మరణాల రేటును తగ్గించారని చెప్పారు. సుమారు 2.98 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి అంధత్వ రహిత రాష్ట్ర సాధనకు కృషి చేశారని వివరించారు. ఇంత సేవ చేసిన ఉద్యోగులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. తెలంగాణ అధికారులు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్రల్లో పర్యటించి అక్కడ జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని సూచించారు. ఆయా రాష్ట్రాల తరహాలో ఇక్కడి ఉద్యోగులను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తామని, అవసరమైతే అసెంబ్లీలో వారి తరఫున గళం వినిపిస్తామని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.