prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 5:30 pm Digital Edition : PRAJA KSHETRAM

నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త..

  • 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టులకు నోటిఫికేషన్.
  • దేశవ్యాప్తంగా స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్
  • మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ
  • నవంబర్ 25 దరఖాస్తులకు చివరి తేదీగా ప్రకటన
  • అత్యధికంగా ముంబైలో 177, జమ్మూ-శ్రీనగర్‌లో 122 ఖాళీలు

నేషనల్ బ్యూరో అక్టోబర్ 27(ప్రజాక్షేత్రం):నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు భారతీయ రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల (ఆర్ఆర్బి) పరిధిలో 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ (సిఈఎన్) నెం. 08/2026 కింద ఈ నియామక ప్రక్రియను చేపడుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోస్టులకు మంగళవారం నుంచే ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 25, 2026 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది. దేశంలోని వివిధ రైల్వే జోన్‌లలో ఈ ఖాళీలు అందుబాటులో ఉండటంతో, అభ్యర్థులు తమకు అనువైన ప్రాంతంలో పోటీ పడేందుకు అవకాశం లభించింది. మొత్తం ఖాళీల్లో అత్యధికంగా ఆర్ఆర్‌బీ ముంబై పరిధిలో 177 పోస్టులు ఉండగా, ఆ తర్వాత జమ్మూ-శ్రీనగర్‌లో 122, చెన్నైలో 119 పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అర్హతలు, పరీక్షా విధానం, సిలబస్, ఖాళీల వివరాలు వంటి పూర్తి సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని రైల్వే మంత్రిత్వ శాఖ సూచించింది.

ప్రత్యేక టికెట్ తనిఖీ డ్రైవ్

ఇదిలా ఉండగా, సెంట్రల్ రైల్వే నెట్‌వర్క్‌లో అక్టోబర్ 31 వరకు ప్రత్యేక టికెట్ తనిఖీ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రైల్వే శాఖ మరో ప్రకటనలో తెలిపింది. రాయితీ టికెట్లు, రిజర్వేషన్ కోటాలు, రైల్వే పాస్‌లు, గ్రూప్ బుకింగ్‌లపై ప్రధానంగా దృష్టి సారించి ఈ తనిఖీలు చేపడుతున్నారు. ప్రయాణికులు రాయితీలు, కోటాల కింద ప్రయాణిస్తున్నట్లయితే తమ అర్హతను నిరూపించేందుకు ఒరిజినల్ గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపించాలని టికెట్ తనిఖీ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఆధార్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ప్రభుత్వ గుర్తింపు కార్డు, విద్యార్థి ఐడీ కార్డు వంటివాటిని అసలు పత్రాల రూపంలోనే చూపించాలి. ఫోన్‌లో ఉన్న ఫోటో లేదా జిరాక్స్ కాపీలను అంగీకరించబోమని అధికారులు తేల్చిచెప్పారు. రైల్వే స్టేషన్లతో పాటు లోకల్ రైళ్లలోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.