prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 4:41 pm Digital Edition : PRAJA KSHETRAM

భవితకు భరోసా.. త్వరలో అందుబాటులోకి భవిత కేంద్రం!

  • నిర్మాణ పనులు తుదిదశకు.. త్వరలో ప్రారంభానికి సన్నాహాలు
  • ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు అందనున్న మెరుగైన సేవలు
  • విద్య, వైద్య, పునరావాస శిక్షణకు ఇక స్థానికంగానే అవకాశం
  • భవిత కేంద్రం అందుబాటులోకి వస్తే తల్లిదండ్రులకు తప్పనున్న ప్రయాణ ఇబ్బందులు

పెద్దేముల్, నవంబర్ 01(ప్రజాక్షేత్రం):ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరో ముందడుగు పడుతోంది.ఇన్నాళ్లూ సరైన సౌకర్యాలు, ప్రత్యేక శిక్షణ కోసం ఎదురుచూస్తున్న చిన్నారులకు త్వరలోనే స్థానికంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. పెద్దేముల్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న భవిత కేంద్రం పనులు దాదాపు పూర్తికావస్తుండటంతో త్వరలోనే అందుబాటులోకి రానుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. భవిత కేంద్రం అందుబాటులోకి వస్తే మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగ, ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాట

ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుంది. సరైన ప్రోత్సాహం, శిక్షణ, మార్గదర్శకత్వం లభిస్తే వారు సైతం తమ సామర్థ్యాలను నిరూపించుకోగలరు. ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వారి పరిస్థితులకు అనుగుణంగా విద్యాబోధన, ప్రత్యేక శిక్షణ, వైద్య సహకారం అందించడం ఎంతో అవసరం.ఈ నేపథ్యంలో భవిత కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయి.పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, స్వతంత్రంగా పనులు చేసుకునే నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, విద్యా పరంగా వారిని ప్రోత్సహించడం వంటి అంశాలకు ఈ కేంద్రాలు వేదికగా నిలుస్తాయి.

ఇక దూరప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులకు చెక్

ఇప్పటివరకు ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల తల్లిదండ్రులు అవసరమైన శిక్షణ, వైద్య సలహాలు, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ తదితర సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల సమయం, ప్రయాణ ఖర్చులు పెరగడమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు.పెద్దేముల్ మండల కేంద్రంలో భవిత కేంద్రం అందుబాటులోకి వస్తే ఈ సమస్యలకు కొంతమేర పరిష్కారం లభించనుంది. మండలంలోని మారుమూల గ్రామాల చిన్నారులకు సైతం స్థానికంగానే సేవలు పొందే అవకాశం ఏర్పడనుంది.

నిర్మాణ పనులు తుదిదశకు

మండల కేంద్రంలో నిర్మిస్తున్న భవిత కేంద్రం భవనం నిర్మాణ పనులు ప్రస్తుతం తుదిదశకు చేరుకుంటున్నాయి. పనులు పూర్తయి అవసరమైన మౌలిక సదుపాయాలు, పరికరాలు, సిబ్బంది ఏర్పాటు పూర్తయితే భవిత కేంద్రం సేవలు ప్రారంభం కానున్నాయి.దీంతో మండల ప్రజలు, ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల తల్లిదండ్రులు కేంద్రం ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సేవలు పూర్తిస్థాయిలో అందించాలి

భవనం నిర్మాణం పూర్తవడమే కాకుండా భవిత కేంద్రంలో అవసరమైన ప్రత్యేక ఉపాధ్యాయులు,శిక్షణ పొందిన సిబ్బంది, వైద్య సహాయకులు, ఫిజియోథెరపీ పరికరాలు, ఇతర అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది.అర్హులైన చిన్నారులను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ అందించాలి.తల్లిదండ్రులకు కూడా పిల్లల సంరక్షణ, అభివృద్ధిపై అవగాహన కల్పించాలి.

భవిత కేంద్రం భవనం కాదు..ఎన్నో కుటుంబాలకు భరోసా!

భవిత కేంద్రం త్వరలో అందుబాటులోకి రానున్న సందర్భం పెద్దేముల్ మండలానికి శుభపరిణామంగా చెప్పవచ్చు. ఇది కేవలం ఒక భవనం నిర్మాణం మాత్రమే కాదు..మండలంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల ఆశలకు ప్రతిరూపం.వారి తల్లిదండ్రుల నిరీక్షణకు సమాధానం చిన్నారుల ప్రతిభను గుర్తించి, వారిని సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా తీర్చిదిద్దేందుకు దోహదపడనుంది.
సంబంధిత అధికారులు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, అవసరమైన సదుపాయాలు కల్పించి భవిత కేంద్రాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.