prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 5:34 pm Digital Edition : PRAJA KSHETRAM

సారపాక కోలాట బృందానికి డబుల్ ధమాకా!

  • ఇండియన్ గ్లోరీ అవార్డ్స్–2026లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు.. ప్రముఖ సినీ హీరో సుమన్ చేతుల మీదుగా అవార్డుల స్వీకరణ

బూర్గంపహాడ్, నవంబర్ 01 (ప్రజా క్షేత్రం):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన శ్రీ కృష్ణం వందే జగద్గురుం కోలాట బృందం జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించింది.హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియన్ గ్లోరీ అవార్డ్స్–2026 వేడుకల్లో ఒకే వేదికపై రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను కైవసం చేసుకుని సారపాక ప్రాంత కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటింది.అక్టోబర్ 31న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్‌లో కళారత్న మూవీస్, రాజు ఎంటర్‌టైనర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ హీరో సుమన్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.

రెండు విభాగాల్లో అవార్డుల పంట

కోలాటం గ్రూప్ విభాగంలో శ్రీ కృష్ణం వందే జగద్గురుం కోలాట బృందానికి, మాస్టర్ విభాగంలో ఆ బృంద గురువు డాక్టర్ తోకల రమేష్‌కు ప్రతిష్ఠాత్మక ఇండియన్ గ్లోరీ అవార్డులు లభించాయి. సంప్రదాయ కోలాట కళను కాపాడుతూ, గ్రామీణ ప్రాంత మహిళలకు శిక్షణ అందిస్తూ కనుమరుగవుతున్న జానపద కళలకు జీవం పోస్తున్నందుకు ఈ గుర్తింపు దక్కింది.

మహిళా కళాకారిణుల ప్రతిభకు గుర్తింపు

గ్రామీణ ప్రాంత మహిళలను కళాకారిణులుగా తీర్చిదిద్దుతూ కోలాట కళను భావితరాలకు అందించేందుకు డాక్టర్ తోకల రమేష్ చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు.బృందంలోని మహిళా కళాకారిణులు వివిధ వేదికలపై తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ జానపద కళకు విశేష గుర్తింపు తీసుకొస్తున్నారు.

కళాకారిణుల కష్టానికి దక్కిన గౌరవం: డాక్టర్ తోకల రమేష్

ఈ సందర్భంగా డాక్టర్ తోకల రమేష్ మాట్లాడుతూ.. తమ బృందానికి రెండు అవార్డులు లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కోలాటం గ్రూప్ విభాగంలో వచ్చిన అవార్డు బృందంలోని ప్రతి కళాకారిణి కష్టానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు. మాస్టర్ విభాగంలో తనకు పురస్కారం రావడం మరింత బాధ్యతను, ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ప్రముఖ సినీ హీరో సుమన్ చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. ఈ విజయాన్ని తమ బృందంలోని ప్రతి కళాకారిణికి, కోలాట కళను అభిమానించే వారందరికీ అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

సినీ, సాంస్కృతిక ప్రముఖుల హాజరు

ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, వి.ఎన్. ఆదిత్య, వంశీ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత వంశీ, రాజు ఎంటర్‌టైనర్స్ అధినేత రాజు, ప్రముఖ కమెడియన్ జెన్నీ, జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేష్, కిషోర్ దాస్, కళారత్న మూవీస్ అధినేత, మిమిక్రీ కళాకారుడు మల్లం రమేష్, మొగిలి గుణకర్ తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో కోలాట బృంద సభ్యులు ఆదిమూలం స్పందన, చేణి ప్రియాంక, సీతారావమ్మ, స్వప్న, జక్కం లక్ష్మి, శిరీష, సంధ్య, అనూష, సత్య, మానస, శాంతి, రేవతి, వీరమ్మ, చిలకల స్పందన, యమున, రమాదేవి, శ్రీలక్ష్మి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఒకే బృందానికి రెండు విభాగాల్లో ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించడం సారపాకతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. ఈ విజయంతో తెలుగు జానపద కళ అయిన కోలాటానికి మరింత ప్రాచుర్యం లభిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి వేదికలపై తమ ప్రతిభను చాటుతామని బృంద సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.