prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 9:13 am Digital Edition : PRAJA KSHETRAM

విద్యాబుద్ధులు చెప్పాల్సిన సారే.. మద్యం మత్తులో జోగుతున్నారట!

  • మద్యం మత్తులో ప్రధానోపాధ్యాయుడు.. తరగతి గదిలోనే నిద్ర!
  • మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారంటూ కలెక్టరేట్‌లో ఫిర్యాదు!

మేడ్చల్–మల్కాజిగిరి, నవంబరు 02(ప్రజాక్షేత్రం):ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడి తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మేడిపల్లి మండలం కమలానగర్‌లోని ప్రధానమంత్రి శ్రీ ఎంపీపీఎస్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారని, విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. పాఠశాలలోని తరగతి గదిని వ్యక్తిగత విశ్రాంతి గదిగా ఉపయోగించుకుంటూ, టేబుల్‌పై కాళ్లు పెట్టుకుని నిద్రిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిరోజూ డైనింగ్‌, బెడ్‌రూమ్‌లా తరగతి గదిని వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎం శ్రీ) పథకం కింద ఎంపికైన పాఠశాలలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) స్పందించి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.