- చంద్రకళ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, 3 ఎకరాల భూమి ఇవ్వాలి
- విద్యార్థినులు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు
- మృతురాలు చంద్రకళ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి
- డక్కలి సామాజిక వర్గం తరతరాలుగా వివక్షకు గురవుతోంది
- చంద్రకళ మృతికి కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలి
- ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
షాద్‌నగర్, నవంబర్ 03(ప్రజాక్షేత్రం):శాతవాహన విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసిస్తున్న డక్కలి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని డాకూరి చంద్రకళ ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం అత్యంత బాధాకరమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రకళ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం షాద్‌నగర్‌లో నిర్వహించిన చంద్రకళ అంత్యక్రియలకు మందకృష్ణ మాదిగ హాజరై ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వయంగా పాడె మోసి, అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డక్కలి సామాజిక వర్గం తరతరాలుగా అంటరానితనం, సామాజిక వివక్ష, అవమానాలు, అణచివేతలను ఎదుర్కొంటూ ప్రధాన సమాజానికి దూరంగా జీవిస్తోందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఈ వర్గంలో అక్షరాస్యత తక్కువగా ఉండటంతో ఉన్నత విద్యను అభ్యసించే వారు అరుదుగా కనిపిస్తారని పేర్కొన్నారు.
ఎన్నో కష్టనష్టాలను అధిగమించి విశ్వవిద్యాలయ స్థాయికి చేరుకొని న్యాయ విద్యను అభ్యసిస్తున్న చంద్రకళ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆశించిన తరుణంలో ఆమె అర్ధాంతరంగా తనువు చాలించడం తీరని విషాదమన్నారు. చంద్రకళ మృతికి కారకులైన వారిని గుర్తించి, సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె మరణంతో తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలు, భవిష్యత్తు కలలు చెదిరిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించి చంద్రకళ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, 3 ఎకరాల వ్యవసాయ భూమిని మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. ఈ విషయమై రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో ఇప్పటికే మాట్లాడగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రత్యేక చొరవ తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన నేపథ్యంలో శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి తన పరిధిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించేందుకు అంగీకరించడంతో పాటు తక్షణ ఆర్థిక సహాయంగా రూ.1.50 లక్షలు అందించేందుకు ముందుకు వచ్చారని వెల్లడించారు. విద్యార్థినులు జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా, తెగువతో సమస్యలను ఎదుర్కోవాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా ఎంఆర్పీఎస్ ను సంప్రదించాలని విద్యార్థినులకు అండగా నిలిచేందుకు ఎంఆర్పీఎస్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం కావని, ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జులు రాగళ్ల ఉపేందర్ మాదిగ, గట్టగాళ్ల ప్రశాంత్ మాదిగ, ఎంఎస్పీ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు రావుగాళ్ల బాబు మాదిగ, ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాదిగ, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ, మల్లికార్జున్ మాదిగ, కొందుర్గు మండల మాజీ అధ్యక్షుడు ఆనేగాళ్ల ఆనంద్ మాదిగ, చెనగల అశోక్ మాదిగ, మల్లెపల్లి బాలరాజు మాదిగ, మహేందర్ మాదిగ, నాగభూషణం మాదిగ, పండు మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

.jpg)
