prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 6:12 pm Digital Edition : PRAJA KSHETRAM

చెత్తలో కూర్చుని కౌన్సిలర్ నిరసన..

కామారెడ్డి నవంబర్ 04(ప్రజాక్షేత్రం):కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత పట్టణ ప్రాంతంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ అధికారులు చెత్త డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని 46, 47 వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా కౌన్సిలర్ లక్ష్మీనారాయణ చెత్తలో కూర్చుని నిరసన తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పనిచేసే పారిశుధ్య కార్మికులు ప్రతిరోజు రాత్రి వేళల్లో రోడ్లు శుభ్రం చేసి ఉదయం హాజరు వేసుకునేవారని తెలిపారు. అయితే ఈమధ్య మున్సిపల్ కమిషనర్ ఆ పద్ధతిని తొలగించి షిఫ్ట్ చేంజ్ చేయడంతో ఉదయం 11 గంటల వరకు కూడా రోడ్లు శుభ్రం కావడం లేదన్నారు. కమిషనర్ అతి ఉత్సాహం, నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాత పట్టణ పరిసరాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిత్యం చెత్త సరిగ్గా సేకరించకపోవడంతో వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, ప్రజలు తీవ్ర దుర్గంధంతో అదనపు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని, పాత పట్టణం, సుభాష్ రోడ్, ప్రభుత్వ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు.