- సీఐ కార్యాలయం ఎదుట అర్ధరాత్రి సర్పంచ్ కీర్తి రామకృష్ణ.
- మహిళా సభ్యుల నిరసన.
మోమిన్‌పేట నవంబర్ 13(ప్రజాక్షేత్రం):మహిళల పట్ల అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తించిన మోమిన్‌పేట సీఐ వెంకట్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, కోల్కుందా గ్రామ సర్పంచ్ కర్ణం కీర్తి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐ కార్యాలయం ఎదుట అర్ధరాత్రి మహిళా సభ్యులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కీర్తి రామకృష్ణ మాట్లాడుతూ.. బుధవారం కోల్కుందా గ్రామంలో జరిగిన గొడవలో ఉపసర్పంచ్ మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, వారి మద్దతుదారులకు గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఉపసర్పంచ్ మహేందర్ రెడ్డి, మరికొందరిని మోమిన్‌పేట పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఎస్సై, సీఐ దుర్భాషలాడారని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకుని ప్రశ్నించేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తనతో పాటు మహిళా వార్డు సభ్యులను కూడా సీఐ వెంకట్ అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని బెదిరించారని పేర్కొన్నారు. మహిళలని కూడా చూడకుండా అనుచితంగా మాట్లాడిన సీఐ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మహిళా సభ్యులతో కలిసి కార్యాలయం ఎదుట నిరసనకు దిగినట్లు తెలిపారు. తమ గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల పోలీసుల వ్యవహారశైలిపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.