prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 5:25 pm Digital Edition : PRAJA KSHETRAM

రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు అధికారి!

  • రూ.40 వేలు డిమాండ్.. చివరకు రూ.30 వేలకు బేరం.
  • తండ్రి పేరు మీద ఉన్న ఇంటిని తన పేరుపై మార్చేందుకు లంచం డిమాండ్.

హైదరాబాద్, నవంబర్ 20(ప్రజాక్షేత్రం):అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో ప్రభుత్వ అధికారి చిక్కాడు. ఇంటి ఆస్తి మ్యుటేషన్ చేసేందుకు లంచం తీసుకుంటూ యెల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న వార్డు అధికారి డి. రవీందర్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ విడుదల చేసిన ప్రెస్‌నోట్ ప్రకారం.. ఫిర్యాదుదారుడి తండ్రి పేరు మీద ఉన్న పూర్వీకుల ఇంటి ఆస్తిని ఫిర్యాదుదారుడి పేరుపై మార్చేందుకు అధికారికంగా సహకరించాల్సి ఉంది. ఈ పనిని పూర్తి చేసేందుకు వార్డు అధికారి తొలుత రూ.40 వేల లంచం డిమాండ్ చేయగా, అనంతరం రూ.30 వేలకు తగ్గించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.30 వేల లంచం స్వీకరిస్తుండగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ వెల్లడించింది. నిందితుడిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ స్పష్టం చేసింది.

లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.