prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 4:31 pm Digital Edition : PRAJA KSHETRAM

నిమ్స్ ఆసుపత్రిలో భారీ అవకతవకలు.. ఏసీబీ తనిఖీల్లో సంచలన విషయాలు!

  • రూ.5 కోట్ల విలువైన వైద్య పరికరాలు ప్రైవేట్ సంస్థల వద్ద నిల్వ..
  • చనిపోయిన రోగుల పేర్లతోనూ బిల్లులు ప్రాసెస్!

హైదరాబాద్ నవంబర్ 23(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పలు అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 29, నవంబర్ 2 తేదీల్లో టీజీ సేఫ్, డ్రగ్ కంట్రోల్, కార్మిక శాఖ అధికారులతో కలిసి ఏసీబీ తనిఖీలు నిర్వహించింది.

తనిఖీల్లో బయటపడిన ముఖ్యమైన అంశాలు:

  • 2019-2025 మధ్య మ్యాన్‌పవర్ నియామకాలు, టెండర్లలో నిబంధనల ఉల్లంఘనలు.
  • ప్రధాన క్యాంటీన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహణ.
  • మెడికల్ షాపుల్లో సరైన విక్రయ రికార్డులు లేకపోవడం, రిజిస్ట్రేషన్ లేని సిబ్బంది విధులు నిర్వహించడం.
  • సెక్యూరిటీ కాంట్రాక్టుల్లో జాప్యం, పదేపదే కాంట్రాక్టుల పొడిగింపు. రూ.28.13 లక్షల బ్యాంక్ గ్యారంటీని జప్తు చేయకపోవడం.
  • ఐదు ఆపరేషన్ థియేటర్ల సమీపంలో సుమారు రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, వైద్య పరికరాలను అనుమతి లేకుండా నిల్వ చేయడం.
  • రోగులు మరణించిన తర్వాత కూడా మూడు నెలల వరకు వారి పేర్లతో బిల్లులు ప్రాసెస్ చేసినట్లు గుర్తింపు.
  • జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో డిశ్చార్జ్ అయిన రోగులకు సంబంధించి సుమారు రూ.66 లక్షల బిల్లింగ్ ఎంట్రీలు.
  • ఒక్క రోగికి ఒక వారంలో 800 గ్లౌజులు వినియోగించినట్లు రికార్డుల్లో నమోదు.

మరింత లోతుగా విచారణకు సిద్ధమైన ఏసీబీ!

తనిఖీల సందర్భంగా నోట్ ఫైళ్లు, ఒప్పంద పత్రాలు, ఇతర కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెలుగులోకి వచ్చిన అవకతవకలపై మరింత పరిశీలన చేపట్టనున్నారు. రోగుల వైద్యం, ప్రభుత్వ నిధుల వినియోగంలో ఇలాంటి అవకతవకలు జరిగాయనే అంశాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఏసీబీ తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.