- గుడికి తాళం వేసిన అగ్రకుల స్వాములపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.
- డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్
రాయపోల్ నవంబర్ 24(ప్రజాక్షేత్రం):దళిత అయ్యప్ప స్వాముల పట్ల కుల వివక్ష పాటించి స్వాములను గుడిలోకి రానివ్వకుండా తాళం వేసుకున్న అగ్రకుల స్వాములపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు మోదు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు సిద్ధిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో కుల వివక్షకు గురి అయిన దళిత అయ్యప్ప స్వాములను కలిసి దళిత బహుజన ఫ్రంట్ బృందం వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా దళితులు సైతం అయ్యప్ప స్వామి మాలలు వేస్తున్నప్పటికీ ఈ సంవత్సరం మాత్రం అగ్ర కులాల కు చెందిన అయ్యప్ప స్వాములు దళిత స్వాములతో కలిసి పూజ, బిక్ష తదితర కార్యక్రమాలలో పాల్గొనమని అయ్యప్ప స్వామి దేవాలయానికి తాళం వేసుకొని దళిత అయ్యప్ప స్వాములను గుడిలోకి రాకుండా కుల వివక్ష అంటరానితనం పాటిస్తూ అవమాన పరచడం సిగ్గుచేటు అన్నారు. అగ్రకుల అయ్యప్ప స్వాము లు గుడికి తాళం వేయడంతో చేసేదేం లేక ప్లాస్టిక్ కవర్లతో ప్రత్యేకంగా ఒక గుడి ఆవరణను దళితులు నిర్మించుకొని పూజ భిక్ష చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. సంఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి కులవక్ష పాటించిన వారిపై అట్రాసిటీ కేసులతో పాటు ఇతర కేసులను నమోదు చేయాలని కోరారు. దేవుడు అందరికీ సమానమని చెప్పే నేటి సమాజంలో దళితులు గుడికి వస్తేనే తాళం వేసుకునే దుస్థితి ఈ సమాజంలో నెలకొనడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త డాక్టర్ కుమార్ దళిత అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.