prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 7:28 am Digital Edition : PRAJA KSHETRAM

రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడి మృతి

తుర్కయాంజల్‌లో అదుపుతప్పి కిందపడిన బైక్‌.. చికిత్స పొందుతూ కన్నుమూత

మృతుడు ఏవీ నగర్‌కు చెందిన బట్టు రవి (35)

రంగారెడ్డి జిల్లా, నవంబర్ 23(ప్రజాక్షేత్రం):ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం ఏవీ నగర్‌-2కు చెందిన బట్టు రవి (35) వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 21న ఉదయం తన పల్సర్ ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా సుమారు 6.45 గంటల సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతని ఆధార్‌ కార్డు, గ్యాస్‌ బిల్లులోని చిరునామా ఆధారంగా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, అప్పటికే 108 అంబులెన్స్‌లో అతడిని ఏవీఎస్‌ ఆసుపత్రికి తరలించినట్లు తెలుసుకున్నారు. అక్కడ న్యూరో సర్జన్‌ అందుబాటులో లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు మన్నెగూడలోని మహనీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఈ నెల 22న సాయంత్రం 6.53 గంటలకు రవి మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.మృతుడి భార్య బట్టు మంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఎస్ఐ సైదులు తెలిపారు.