prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 2:49 am Digital Edition : PRAJA KSHETRAM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పైళ్ల ప్రతాపరెడ్డి కన్నుమూత

  • మాజీ పోలీస్ పటేల్‌గా ఐదు దశాబ్దాల క్రితమే గ్రామానికి సేవలు..
  • ఆయన మృతి గోపరాజుపల్లికి తీరని లోటు!

వలిగొండ, నవంబర్ 24(ప్రజాక్షేత్రం):యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన మృతి పట్ల గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామంలో సర్పంచ్ వ్యవస్థ ఏర్పడకముందు సుమారు 50 సంవత్సరాల క్రితమే పోలీస్ పటేల్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రతాపరెడ్డి గ్రామ ప్రజలకు విశేష సేవలందించారు. గ్రామంలో ఏ సమస్య తలెత్తినా ప్రజలందరినీ కలుపుకొని, వారి సమక్షంలోనే పరిష్కరించేందుకు కృషి చేసేవారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మెలుగుతూ, ప్రజలతో మమేకమై జీవించిన ఆయన గ్రామంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజల మధ్య ఐక్యతకు తనవంతు కృషి చేసిన ఆయన సేవలను గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం గోపరాజుపల్లి గ్రామానికి తీరని లోటని, ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని గ్రామ ప్రజలు విచారం వ్యక్తం చేశారు.