రాజువయ్య! మహా రాజువయ్య!
(మహా మహోపాధ్యాయుడి పదవి విరమణ సందర్భంగా)
కొందరు సార్దక నామధేయులుగా పుడుతూ ఉంటారు. అట్టి కోవకు చెందినటువంటి స్థితప్రజ్ఞుడు, అపార చాణిక్యుడు, మేధావి, కోపం ఎరగని నడయాడే రక్త మాంసాల దైవ స్వరూపం, జ్ఞాని, తత్వవేత్త, మనస్తత్వ శాస్త్రవేత్త,వాణిజశాస్త్ర విభాగ అధిపతి, కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థులకు ఆరాధ్య దైవం, అధ్యాపకులకు ఆరాధ్యనీయుడు, పూజనీయుడు, అనుసరణీయుడు, మార్గదర్శకుడు, మితవాది, అజానుభావుడు, అజాతశత్రువు, కలియుగ ధర్మరాజు, ధర్మ ప్రభువు, పరిపాలన దురంధరుడు, సంస్కరణవాది, వ్యూహకర్త, ఆర్థికవేత్త, కళాశాల యాజమాన్యానికి అణుంగు అనుచరుడు, నిబద్ధత కలిగిన ఒక ఆచార్యుడు, సమయపాలన నిక్కచ్చిగా పాటించే బడిపంతులు, బహుదూరపు బాటసారి, ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విజ్ఞాన సంపన్నుడు, నిరాడంబరుడు, 3,500 మంది విద్యార్థులకు ఇష్టమైన, ప్రియమైన, ప్రిన్సిపల్ ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే తెలుగు భాషలో ఉన్న గౌరవ పద వచనాలన్నీ కూడా సరిపోవేమో ఆయన వ్యక్తిత్వం ముందు ఆయనే డా. చింతలూరి రాజలింగం గారు. ఆయన ప్రస్తుతం ఆంధ్ర విద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ గా పదవి విరమణ చేయబోతున్న సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాను.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అనే నానుడి చిత్తలూరి రాజలింగం పట్ల నిజమైంది. ఆయన 1965 ఫిబ్రవరి 10వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా కు చెందిన కోటమర్తి గ్రామంలో చిత్తలూరి రామ చంద్రయ్య గౌడ్, చిత్తలూరి రేణుక ఎల్లమ్మ దంపతులకు ఐదవ సంతానంగా జన్మించాడు. ఆయన తల్లిదండ్రులకు మొత్తం తొమ్మిది మంది సంతానం. అయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ తొమ్మిది మంది ఇంకా బ్రతికే ఉన్నారు. అది ఆయన తల్లిదండ్రులు చేసుకున్న గొప్ప పుణ్యం గా చెప్పుకుంటూ ఉంటాడు ఆయన. కోటమర్తి అనే గ్రామం మోత్కూరు మండలంలో ఉండేది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జిల్లాలు, మండలాల వికేంద్రీకరణలో భాగంగా ప్రస్తుతం అడ్డగూడూరు మండలంలోకి కోటమర్తి గ్రామం వెళ్ళిపోయింది. తన ప్రాథమిక విద్యాభ్యాసం, ప్రాథమికోన్నత విద్యాభ్యాసాన్ని స్కూల్ సెకండరీ విద్యాభ్యాసాన్ని కూడ కోటమర్తి గ్రామంలోనే 1981 వ సంవత్సరంలో పూర్తి చేశాడు. 1983 వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ లో సీ.ఈ.సీ ని తీసుకొని జిల్లా కేంద్రమైన నల్గొండలో చదివి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. 1986వ సంవత్సరంలో నల్గొండ కేంద్రంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాలయమైన నాగార్జున గవర్నమెంట్ కళాశాలలో చదువుకోని బీ.కాం డిగ్రీ పట్టాను పుచ్చుకున్నాడు. 1988వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎం. కామ్ పూర్తి చేశాడు. తదనంతరం 1993 వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఏం. ఫీల్ పూర్తి చేశాడు. ఆయన ఇంపాక్ట్ అఫ్ కమర్షియల్ క్రాప్స్ రూరల్ ఎకనామి మీద పరిశోధన చేసి ఎం. పిల్ డిగ్రీ అవార్డును పొందడం కొసమెరుపు. మొన్నటివరకు హైదరాబాద్ పట్టణానికి శాంతి భద్రతల కమిషనర్ గా ఉన్న కొత్త కోట శ్రీనివాసరెడ్డి ఇద్దరు సహాధ్యాయులు. అదేవిధంగా గద్వాల జిల్లాకు అడిషనల్ డిప్యూటీ రెవెన్యూ కలెక్టర్ గా ప్రస్తుతం పని చేస్తూ ఉన్న లక్ష్మీనారాయణ గారు కూడా ఈయన సాహధ్యాయి నే, 2001వ సంవత్సరంలో పీ.హెచ్డీ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా పొందాడు. పరిశోధనలో భాగంగా ఇంపాక్ట్ అఫ్ ఫ్రీ పవర్ అండ్ కమర్షియలైజేషన్ అండ్ రూరల్ ఎకానమీ. అనే అంశం మీద విస్తృతంగా పరిశోధించి పీ.హెచ్డీ డిగ్రీని సాధించాడు. ఇక్కడ ఆయన గొప్పతనాన్ని చెప్పుకోవాలి. ఆయన గైడు దగ్గర ఇంతవరకు పీ.హెచ్డీ డిగ్రీ అవార్డు పొందిన ఏకైక విద్యార్థి గా రాజలింగం గారు నిలిచారు. ఆయన రాసిన పి.హెచ్డి సిద్ధాంత గ్రంథంలో ఉన్నటువంటి సలహాలను, సూచనలను, వై.యస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉచిత కరెంటు పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఈ పరిశోధక గ్రంథం నుండి సలహాలను, సూచనలను స్వీకరించింది. ఆ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 6 కోట్ల ఆంధ్రులకు ఆయన రాసిన పీ.హెచ్డీ సిద్ధాంత గ్రంథం ఉచిత విద్యుత్తు రూపంలో ఉపకరించింది. ఈ గ్రంథం ఆధారంగానే వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్ ఫైల్ పైన మొట్టమొదటి సంతకం చేసాడు. ఇది చరిత్రకా సాక్ష్యం.
నల్గొండలో డిగ్రీ విద్యాభ్యాసం పూర్తికాగానే ఎన్.సి .సి కమాండింగ్ ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చింది. ఎందుకో ఏమో ఇది ఆయన తల్లిదండ్రులకు నచ్చలేదు. తల్లిదండ్రులకు నచ్చ చెప్పాడు. చివరకు తల్లిదండ్రులకు మాటకు విలువ ఇస్తూ అది ఆర్మీ ఉద్యోగం అని తల్లిదండ్రులు బాధపడుతుంటే నిరాకరించి ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అలా వదులుకోవడం వల్ల ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడానికే అని ఆ రోజుల్లో ఆయనకు తెలియదు. విధి ఎంత బలియమైనదో చూడండి. ఒకవైపు ఉన్న ఉద్యోగం వదిలివేసి తన భవిష్యత్తును నగరంలో వెతకడం ప్రారంభించాడు. ఈ కోవలోనే ఆయన లయోలా జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ఆ తర్వాత పద్మావతి డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పనిచేశారు. దిల్ శూక్ నగర్ కేంద్రంగా ఉన్నటువంటి నోబుల్ ఎం.సీ.ఏ కళాశాల యందు కూడా పాఠాలు చెప్పేవాడు. కోటికి దగ్గరగా ఉన్న ప్రగతి మహావిద్యాలయంలో కూడా ఆయన బోధన అనుభవాన్ని అక్కడి విద్యార్థులకు అందించాడు. రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎం.సీ.ఏ లో కూడా తరగతులు చెప్పి విద్యార్థులను ఆకట్టుకున్నాడు. అత్యవసరంగా పాఠాలు చెప్పాల్సివస్తే రెసిడెన్సి ఎం.సీ.ఏ కళాశాలలో ఆయన కోసం ప్రత్యేకంగా తరగతులను ఏర్పాటు చేశారు అక్కడ యాజమాన్యం. ఇవన్నీ కాదు అని తనే సొంతంగా లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలను స్థాపించాడు. కళాశాల స్థాపక యాజమాన్యంగా ఆయన విశిష్టమైనటువంటి సేవలు అందించాడు. తోటి అధ్యాపకుల బాధలను తన బాధలుగా భావించాడు. విద్యార్థులను తీర్చిదిద్ది భరతమాత సేవకై తపించేలా ఆమె ఒడిలోకి చేర్చాడు. దోమలగూడలో నెలకొని ఉన్న చరిత్రత్మక విద్యాసంస్థ లో 1992 వ సంవత్సరంలో ఆంధ్ర విద్యాలయ ఆర్ట్స్ & సైన్స్ , కామర్స్ కళాశాలలో ఒప్పంద అధ్యాపకునిగా చేరి 1997 వ సంవత్సరంలో రెగ్యులరైజేషన్ సాధించాడు. 1992 నుంచి 96 మధ్య భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ సమయంలో ఆయన డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా చేరడం కోసమేరుపు. ఆయన తన హృదయాన్ని ఆవిష్కరిస్తు నాతో చెబుతాడు. అప్పటి మన ప్రధాని పీ.వీ నరసింహారావు దేశ ఆర్థిక సంస్కరణాలను సరళీకరించడం, అప్పటి యూపీఏ — 1&2 మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాలు దేశ ఆర్థిక పురోభివృద్ధికి ఏ విధంగా తోడ్పడ్డాయో నేను నా కుటుంబ ఆర్థిక అభివృద్ధికి అదే విధంగా తోడ్పడ్డాను. ఆర్థికంగా నిలదొక్కుకున్నాను. అంటాడు ఆయన. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక సంస్కరణల ప్రభావం అతనిపైన ఉంది. అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. వాణిజ్య శాస్త్ర విభాగంలో మాజీ శాకాధిపతి సీఏ బుచ్చిరెడ్డి గారి గురించి చెబుతూ హైదరాబాద్ పట్టణంలో అత్యంత పేరెన్నిక కన్నా సి. ఏ కోచింగ్ ఎక్స్పర్ట్ ఆయన దగ్గర చాలా సబ్జెక్టు నేర్చుకున్నానని, ఆయన వ్యక్తిత్వాన్ని తనలో నిబిడీకృతం చేసుకున్నానని, ఆయన చూపే ఆదరణ ప్రేమ ఆప్యాయత, అటెండర్ నుంచి అధ్యాపకుల వరకు అందరూ మనసులే అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవిలో మారుమోగుతుంటాయని చెబుతాడు. సీ.ఏ బుచ్చిరెడ్డి గారి సారథ్యంలో కాఫీలు, టిఫిన్లు తింటూ అధ్యాపకులందరూ సహోదర భావంతో మెలిగే వాళ్ళం. అలాంటి నిష్ణాతులైన వ్యక్తులతో పనిచేయడం వల్ల నాకు స్నేహపూరిత వాతావరణం అలవాటు పడింది అంటాడు ఆయన. మాక్సిజం, లేనినిజం, మావోయిజం, విప్లవోద్యమాలు, నక్సలైట్ల పోరాటాలు, అన్నింటి గురించి లోతైన అవగాహన కలిగి ఉన్న వ్యక్తి. ఇవన్నీ కాదు భాస్కర్ ఈ వాదాలు, ఆ వాదాలు కాదు మానవతవాదమే ముఖ్యం అంటాడు ఆయన. నాతో ఒక సందర్భంలో చెప్పిన మాట నాకు ఇంకా ఇప్పటికి గుర్తుగా ఉంది. భాస్కర్ మీ గురువుగారైన ఆచార్య గోన నాయక్ గారు. కమ్యూనిజం లో నిజం ఎంత రాజలింగం అని నన్ను ప్రశ్నించే వాడు. మీ గురువు గారి మాటల్లో కమ్యూనిజంలో నిజం లేదు. కాస్త కూసో నిజం ఉంది అంటే 1956 వరకు మాత్రమే అప్పటి తరం కమ్యూనిజం నాయకులకు మాత్రమే కమ్యూనిజం పట్ల పూర్తి నిబద్ధత విశ్వాసనీయత కలిగి ఉండేవారు. 1956 నుండి వచ్చిన కమ్యూనిస్టులు ఎవరు కూడ అంత నిబద్ధత విశ్వాస నియత కలిగి లేరు. అంటూ ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ కగార్ గురించి పరోక్షంగా హెచ్చరించాడు. మీరందరూ అనుకుంటారేమో ఒకప్పటి ఇల్లందు ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కమ్యూనిస్టు అనుకుంటారు. అది కాదు అంటారు మీ గురువుగారు. ఆయనను గిరిజన నాయకుడిగా చూడాలంటారు. రాజలింగం గారు. ఆయనతో ముచ్చట అంత తొందరగా ముగియదు. ఏ విషయం పైన మాట్లాడితే ఆ విషయంలో అత్యంత నిష్ణాతులైన వ్యక్తి, బయటకి కనిపించరు కానీ, కదిలిస్తే చాలు ప్రపంచ చరిత్ర, భారతదేశ చరిత్ర, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ తొలి దశ ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమాలను విపులంగా విషదీకరిస్తూ చెబుతాడు. నాకు తెలిసి ఆయన ఈ విషయాల పట్ల అవగాహన ఉన్న నడయాడే ఎన్ సైక్లోఫిడియాగా నేను ఆయనను అభివర్ణిస్తున్నాను. ఆంధ్ర విద్యాలయ కళాశాలలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశాడు. ఎన్.సి.సి ఆఫీసర్ గా, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గా కేర్ టేకర్ గా, వైస్ ప్రిన్సిపాల్ గా, కోర్సు కోఆర్డినేటర్ గా, ఆడిటర్ గా, స్టూడెంట్ అడ్వైజర్ గా, అన్ని పదవులను నిర్వహించిన ఏకైక వ్యక్తిగా ఆంధ్ర విద్యాలయ కళాశాలలో రికార్డు సృష్టించాడు. 2017 వ సంవత్సరం నుండి ప్రిన్సిపల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రిన్సిపాల్ గా ఆంధ్ర మహా విద్యాలయ కళాశాలలోనే రెండవ ప్రిన్సిపాల్ గా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఎస్విఎన్ రెడ్డి తర్వాత అత్యధికకాలం పనిచేసిన ఏకైక ప్రిన్సిపల్ గా డా. సి.హెచ్ రాజలింగం గారు నిలిచారు. దాదాపు పది సంవత్సరాలపాటు ఆయన ప్రిన్సిపల్ గా కొనసాగాడు. ఈ పది సంవత్సరాల కాలంలో కొన్ని వేల మంది విద్యార్థుల ఆదర అభిమానాలను చురగొన్నాడు. విద్యార్థుల తలలో నాలుక లగా తయారయ్యాడు. ఏ విద్యార్థికి కష్టం వచ్చిన, నష్టం వచ్చిన పగలనకా రేయనక, కష్టించి పని చేసి ఆంధ్ర విద్యాలయ కళాశాలను తెలంగాణ రాష్ట్రంలోనే టాప్ టెన్ కళాశాలలో ఒకటిగా ఎదిగేటట్లు ఉన్నతంగా తీర్చిదిద్దాడు. ఆయన సారథ్యంలో రెండుసార్లు జాతీయ గణాంక మదింపు సంస్థ అయిన న్యాక్ విజిట్ ను ప్రిన్సిపాల్ గా రెండుసార్లు ఎదుర్కొన్నాడు. ఇప్పటివరకు ఆయన 26 జాతీయ, అంతర్జాతీయ వేదికల పైన పరిశోధన పత్రాలను సమర్పించి ఉన్నాడు. ఆ పరిశోధన పత్రాలన్నీ కూడా విశ్వాసనీయమైనవి మన్నిక గలిగినవి. పరిశోధన నిబద్ధతకు నిలబడ్డవి, వాణిజ్య శాస్త్రానికి అత్యంత అమూల్యమైనవి. ఆయన యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ నుండి మేజర్ రీసర్చ్ ప్రాజెక్టులను, మైనర్ రీసెర్చ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేశాడు. కళాశాలతో ఆయనకు 34 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉంది. సదస్సులు, సమావేశాలలో కళాశాల గురించి ఆయన అద్భుతంగా చెబుతూ ఉంటాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం , ఆంధ్ర రాష్ట్ర మహాసభ నేపథ్యం, ఆంధ్ర విద్యాలయం ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులు, విద్యాలయ స్థాపనకు కృషి చేసినటువంటి మహానీయులు, వారి సేవలను, వారి గుణ గణాలను భవిష్యత్ తరానికి తెలియ చెప్పాలని ఉద్దేశంతో వారి, వారి వ్యక్తిత్వంతో విద్యార్థులు పరకాయ ప్రవేశం చేయాలనేటువంటి సంకల్పంతో కళాశాల గురించి, కళాశాల సాధించిన విజయాలు. కళాశాల పూర్వ చరిత్రను , ప్రముఖులైన కళాశాల పూర్వ విద్యార్థుల గురించి చెబుతూ ఉంటే చెవులతో ఊరాడిస్తూ వినాలనిపిస్తుంది.
సున్నితమైన హాస్య చతురత రాజలింగం గారి నైజం, నానుడులు, తెలుగు సామెతలు, తెలుగు పలుకు బళ్ళు, తెలుగు భాష పైన పట్టు ముఖ్యంగా తెలంగాణ యాస పైన, తెలంగాణ భాష పైన, మాండలీకాల పైన, పట్టు ఉన్నటువంటి ఆచార్యులు ఆయన. నాతో చాల సందర్భాలలో సామెతలను ఉటంకిస్తూ ఉండేవాడు. ఆయన చెప్పిన సామెతల్లో మచ్చుకు ఒకదాన్ని మాత్రమే ఉదాహరిస్తాను నేను.1) కోడలికి సుద్దులు చెప్పి అత్త తెడ్డు నాకిందట. 2)ఎంత మంచి గోళ్లోనికైనా యాపకాయ అంత వెర్రి ఉంటే నీకు గుమ్మడికాయ అంత వెర్రి ఉంది భాస్కర్ అనే వాడు నన్ను ఉద్దేశించి, ఇది ఆయనకు తెలుగు భాష పట్ల ఉన్న మమకారం , అందరిని నవ్విస్తూ, కవ్విస్తూ సభను ప్రారంభించడం ఆయన నైజం, చలోక్తులు విసురుతూ, నవ్విస్తూ, సమస్యను సూటిగా చెప్పడం, విసుగు లేకుండా వినసొంపుగా చెప్పడం, ఆయన ప్రత్యేకత, ఆరు అడుగుల జానుబాహుడు నిరాడంబరంగా, శాంతియుతంగా, సమస్యను సావధానంగా అర్థం చేసుకొని, ఎవ్వరిని నొప్పించకుండా, ఎవ్వరిని బలవంతంగా ఒప్పించకుండ నేపాన్ని ఇతరుల మీదకు నెట్టకుండ పరిపాలన సాగించాడు. ఆయన ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు దాదాపు 30 వేల మంది విద్యార్థుల వరకు కళాశాల ను వదిలి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్లందరూ ఎక్కడ కలిసిన ఎవరికి కలిసిన , ఎప్పుడు కలిసిన,వాళ్లు , వాళ్లు కలుసుకున్న కూడ రాజలింగం సార్ గారి ప్రస్తావనే ఉంటుంది. అంటే అతిశయోక్తి కాదేమో!
కరుడుగట్టిన కమ్యూనిస్టుని నేను, ఆయన చెప్పే కమ్యూనిస్ట్ సిద్ధాంతం విని, నా కళ్ళు తెరిపించి నన్ను కమర్షియల్ వ్యక్తిగా మార్చాడు. నాకు ఆర్థిక సలహాలు, సూచనలు ఇస్తూ ఆర్థికంగా నేను బలపడడానికి బాటలు వేశాడు. ఆయన దగ్గర పనిచేసే ఒక సహచర అధ్యాపకుడి నీ ఇంతగా అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన ఆయన తరగతి గదిలో పాఠాలు చెబుతున్నప్పుడు, వాళ్లలో ఇంకెంత ఆర్థిక చైతన్యాన్ని తీసుకువచ్చి ఉంటాడు ఒకసారి ఆలోచించండి పాఠక మహాశయులారా! ఆయనలో రెండు విభిన్న కోణాలు ఉన్నాయి.1. వ్యక్తిత్వ వికాస సంపన్నుడు 2. తాత్వికవేత్త
మొదటి దాన్ని గనక పరిశీలించినట్లయితే ఆయన మాటలు ఆయన చేతలు, ఆయన బాడీ లాంగ్వేజ్, మాట తీరు, ఆయన ధరించే వస్త్రాధారణ, అన్ని కూడా ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త అయిన సిగ్మాండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతాలకు అతి దగ్గరగా ఉంటాయి. మనిషిని ముఖం చూసి లోతుగా అంచనా వేస్తాడు. సమస్యను వెంటనే పసిగట్టేస్తాడు. శరీరక, భౌతిక అవసరాల అనుగుణంగా, మానసిక అవసరాలు కూడా ఉంటాయి. అని గ్రహించి ఈ నేపథ్యంలో ఆయన తీర్పు ఇస్తూ ఉంటాడు. ఆయన పైన సిగ్మాండ్ ఫ్రాయిడ్ ప్రభవం చాలా ఎక్కువగానే ఉంటుంది. నేను రాజలింగం గారు. మా ఇరువురి ఆరాధ్య దైవమైన ఆచార్య కొండ రామచంద్ర రెడ్డి గారిని కూడ ముద్దుగా మేము ఇండియన్ సిగ్మాండ్ ఫ్రాయిడ్ అని పిలుచుకుంటాం. ఆచార్య కొండా రామచంద్రా రెడ్డి గారి దగ్గర వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన మాటలు విని ఆయన మాటలకు ప్రభావితం అయ్యాను అని అంటాడు రాజలింగం గారు. ఇక ఆయనలో ఉన్న తాత్విక భావనాల అంశాలకు వస్తే నాకు ఆయనలో జాన్ డ్యూయీ కనిపిస్తాడు. ఈయన వ్యవహారిక సత్తా వాదాన్ని ప్రతిపాదించాడు. దీని ఆంగ్లంలో ప్రాగ్మా టీజం అంటారు. ప్రతి మనిషి యొక్క తాత్వికత వ్యవహారిక సత్తా వాదమే భాస్కర్ అంటాడు ఆయన. అంటే ఆయన మాటల్లో వ్యక్తి వ్యవహరించే విధానమే, వ్యక్తి యొక్క నడవడిక, వ్యక్తి యొక్క జీవితం, వ్యక్తి అభివృద్ధి, వ్యక్తి వైఫల్యం, వ్యక్తి విజయాలు ఆధారపడి ఉంటాయి. అని సెలవిస్తాడు. అందుకే ఆయన ఆర్థికంగా ,సామాజికంగా, రాజకీయంగా, కుటుంబ పరంగా, పరిశోధనలో, బోధనలో, ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగాడు. ఆయన శేష జీవితం అంతా కూడ సుఖంగా ,సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వ్యాసన్ని బరువెక్కిన హృదయంతో నా ఆరాధ్య దైవానికి అంకితం చేస్తూ ముగిస్తున్నాను.

రచన
డాక్టర్ జి.భాస్కర్ యాదవ్
ప్రొఫెసర్ ఉస్మానియా విద్యాలయం హైదరాబాద్ తెలంగాణ

