చెమటోడ్చిన వారికి గౌరవం లేదు…కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు!
– కాంగ్రెస్‌లో మౌన విప్లవం…పాత వారిలో పెరుగుతున్న అసంతృప్తి
– “మా త్యాగాలకు విలువ ఎక్కడ?”–కాంగ్రెస్‌లో సంచలన ఆరోపణలు!
– కష్టకాలంలో కాపాడిన వారికే గుర్తింపు లేదు…కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి!
– కష్టకాలంలో కాపాడిన వారిని పక్కన పెట్టారు.AR సాదు యాదవ్ విమర్శలు
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):దుండిగల్ సర్కిల్ బహదూర్‌పల్లి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత అసంతృప్తి బహిర్గతమైంది. పార్టీ కష్టకాలంలో కంటికి రెప్పలా కాపాడిన పాత కార్యకర్తలు, సామాజికవేత్తలు, నాయకులను పూర్తిగా పక్కన పెట్టారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏఆర్ సాదు యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. “కార్యకర్తల చెమట, త్యాగాల మీదే నేటి నాయకులు అధికార హోదాలు అనుభవిస్తున్నారు. కేసులు ఎదుర్కొని, రక్తం చిందించి పార్టీ జెండాను నిలబెట్టిన వారిని నేడు చెరివి వేస్తున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కుటుంబాలను కూడా వదులుకొని రోడ్లపై తిరిగిన కార్యకర్తలకు ఒక్క పదవి, గౌరవం కూడా దక్కలేదని అన్నారు. అవమానాలు, బెదిరింపులు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆఫర్లకు లొంగలేదని చెప్పారు. “కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం, నమ్ముకున్న నాయకత్వం కోసం, ముఖ్యంగా ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో నిలబడ్డాం. కానీ అధికారం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది” అని వ్యాఖ్యానించారు.
పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ఒక్క నామినేటెడ్ పదవి కూడా దక్కలేదని, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికే ప్రాధాన్యం పెరిగిందని ఆరోపించారు. “డబ్బు, కులం, లాబీయింగ్ ఉన్నవారికే అవకాశాలు వస్తున్నాయి. పాత చెప్పుల కంటే కొత్త కొమ్ములకే విలువ పెరిగింది” అని విమర్శించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీ పరాజయం ఖాయమని స్థానిక నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
పార్టీ కష్టకాలంలో నిలబడ్డ వారిని గుర్తించి సముచిత గౌరవం ఇవ్వాలని, అంతర్గత విభేదాలను పరిష్కరించాలని నాయకత్వాన్ని కోరుతున్నారు.


