ఎవరి లాభం కోసం నామమాత్రపు చర్యలు
– అక్రమ షెడ్లలో కంపెనీల కార్యకలాపాలకు సన్నాహాలు
– ఇది యాక్షన్ కాదు…కేవలం చూపు కోసం చేసిన నాటకం!
– ఇదేనా చర్యల తీరు…. అధికారులపై మండిపడుతున్న స్థానికులు
కుత్బుల్లాపూర్, మార్చి 22 (ప్రజాక్షేత్రం):కొంపల్లి సర్కిల్ పరిధిలోని దూలపల్లి న్యూ స్టీల్ సిటీలో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల చర్యలు తీవ్ర అనుమానాలకు దారితీస్తున్నాయి. ఇటీవల చేపట్టిన చర్యలు కేవలం నామమాత్రంగానే మిగిలిపోయాయన్న ఆరోపణలు స్థానికుల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు తాత్కాలికంగా స్పందించినప్పటికీ, అది కేవలం చూపు కోసం చేసిన చర్యలా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు వెళ్లిన మరుసటి రోజే నిర్మాణ పనులు యథావిధిగా తిరిగి ప్రారంభం కావడం, అధికారుల చర్యలపై నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. మొత్తం ఐదు అక్రమ షెడ్ నిర్మాణాలు జరుగుతుండగా, కేవలం మూడు నిర్మాణాలపైనే పరిమిత చర్యలు తీసుకోవడం వెనుక కారణాలు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. మిగతా నిర్మాణాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసిన అక్రమ షెడ్లలో త్వరలోనే కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో, “ఇది నిజమైన చర్యలేనా? లేక సెటిల్మెంట్ల కోసం చేసిన నాటకమా?” అన్న సందేహాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ నామమాత్రపు చర్యలు పై అధికారులకు నివేదికలు చూపించడానికే పరిమితమయ్యాయా? లేక వీటి వెనుక మరెవరైనా ప్రభావం ఉందా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. దూలపల్లి న్యూ స్టీల్ సిటీలో కొనసాగుతున్న అక్రమ షెడ్ నిర్మాణాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని,పూర్తిగా తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఈ సమస్యపై పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

