📄 ePaper
Tuesday, March 24, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణకమర్షియల్ కొరత… డొమెస్టిక్ దందా

కమర్షియల్ కొరత… డొమెస్టిక్ దందా

📰 Generate e-Paper Clip

కమర్షియల్ కొరత… డొమెస్టిక్ దందా

  • లెక్కలు ఒకలా… వినియోగం మరోలా
  • 5 వేల హోటళ్లకు 2,717 కనెక్షన్లే
  • య‌దేచ్చంగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో డొమెస్టిక్ వినియోగం
  • ఏజెన్సీల పర్యవేక్షణపై సందేహాలు
  • స్పష్టత లేని సీఎస్ఆర్ కనెక్షన్లు
  • ధర తేడాతో దుర్వినియోగం ఈకేవైసీ అమల్లో నిర్లక్ష్యం
  • ప్రక్షాళన కోరుతున్న ప్రజలు

కరీంనగర్, మార్చి 24(ప్రజాక్షేత్రం):జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల గణాంకాలు, వాస్తవ వినియోగం మధ్య తేడాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కలు ఒక విధంగా ఉన్నప్పటికీ నేలమీద పరిస్థితి మరోలా ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 4,69,101 గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ అందులో 4,66,384 డొమెస్టిక్ కనెక్షన్లే ఉండటం గమనార్హం. ఇదే సమయంలో కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు కేవలం 2,717 మాత్రమే ఉండటం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలో 5,000కు పైగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ లెక్కలు డొమెస్టిక్ గ్యాస్ వినియోగం వ్యాపార అవసరాలకు మళ్లుతున్నట్లు స్పష్టతనిస్తున్నాయి. మరోవైపు జనరల్ కనెక్షన్లు 3,39,753గా ఉండగా, దీపం కింద 66,698, ఉజ్వల కింద 31,317 కనెక్షన్లు నమోదయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు 628 కనెక్షన్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. సీఎస్ఆర్ కింద 27,454 కనెక్షన్లు ఉన్నట్లు చూపుతున్నప్పటికీ అవి ఎవరికి చేరుతున్నాయి, ఎక్కడ వినియోగంలో ఉన్నాయి అన్న అంశాలపై స్పష్టత లేకపోవడంతో వ్యవస్థ పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఏజెన్సీలు పుష్కలం… పర్యవేక్షణ శూన్యం?

జిల్లాలో మొత్తం 23 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తుండగా హెచ్పీసీఎల్ 9, ఐవోసీఎల్ 6, బీపీసీఎల్ 8 ఉన్నాయి. అన్ని కంపెనీలు ఉన్నప్పటికీ కనెక్షన్ల జారీ, వినియోగంపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ కనిపించకపోవడం ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇదే సమయంలో పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సరఫరా కఠినమైనప్పటికీ జిల్లాలో ఫుడ్ వ్యాపారం పెద్దగా దెబ్బతినలేదు. సుమారు 20 శాతం వ్యాపారాలు మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొనగా మిగతా 80 శాతం యథావిధిగా కొనసాగుతున్నాయి. అధికారులు చేసిన అంచనాల్లోనే అసలు పరిస్థితి స్పష్టమవుతోంది హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, దాబాలు, ప్రైవేట్ హాస్టళ్లలో విస్తృతంగా డొమెస్టిక్ గ్యాస్ వినియోగమే కొనసాగుతోన్న‌ట్లు స్ప‌ష్టం అవుతుంది. జిల్లాలో సుమారు 7,000 వరకు ఆహార వ్యాపార కేంద్రాలు ఉన్నట్లు అంచనా ఉన్నా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు మాత్రం 2,717కే పరిమితం కావడం గమనార్హం. ఈ లెక్కన మిగతా వేలాది వ్యాపారాలు ఏ గ్యాస్‌తో నడుస్తున్నాయి అన్న ప్రశ్న యంత్రాంగంపై ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

డొమెస్టిక్ గ్యాస్‌తోనే వ్యాపారం..?

వ్యాపార అవసరాలకు కమర్షియల్ గ్యాస్ తప్పనిసరి అయినప్పటికీ జిల్లాలో వాస్తవ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. కరీంనగర్‌తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, మానకొండూరు తదితర మండలాల్లో విస్తృతంగా డొమెస్టిక్ సిలిండర్ల వినియోగమే కొనసాగుతోంది. ట్రేడ్ లైసెన్సులు ఉన్న సంస్థలకే కమర్షియల్ కనెక్షన్లు లేకపోవడం పర్యవేక్షణ బ‌హిర్గతం చేస్తోంది. మరోవైపు 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న కుటుంబాల కంటే జిల్లాలో సుమారు 1.70 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఎక్కువగా ఉండటం గ్యాస్ పంపిణీ వ్యవస్థపై అనుమానాలను పెంచుతోంది. సీఎస్ఆర్ కింద ఉన్న 27,454 కనెక్షన్లు ఎవరికి చేరాయి, ఎలా వినియోగంలో ఉన్నాయి అన్న విషయంపై స్పష్టత లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. డొమెస్టిక్ సిలిండర్ ధర సబ్సిడీతో తక్కువగా (సుమారు రూ.984) ఉండగా కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,145 వరకు ఉండటం దుర్వినియోగానికి కారణమవుతున్నట్లు తెలుస్తుంది. కొంతమంది ఏజెన్సీలు నిబంధనలు పక్కనబెట్టి కనెక్షన్లు జారీ చేశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిర్లక్ష్యంగా ఈకేవైసీ

జిల్లాలో ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ సగానికి పైగా గ్యాస్ కనెక్షన్లు పూర్తి కాలేదని తెలుస్తున్న స‌మాచారం. అయినప్పటికీ సంబంధిత యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో గ్యాస్ వినియోగంపై సమగ్ర ప్రక్షాళన అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబ్సిడీ గ్యాస్ నిజంగా అర్హులకు చేరేలా చర్యలు తీసుకోవడంతో పాటు దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అవసరమైతే కలెక్టర్ స్థాయిలో జోక్యం చేసుకుని వ్యవస్థను సరిదిద్దాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular