నాగారం శ్మశానంలో నిబంధనల ఉల్లంఘన
- సమయానికి విరుద్ధంగా దహనాలు.. స్థానికుల్లో ఆందోళన
నాగారం, మార్చి 21(ప్రజాక్షేత్రం):ఘట్కేసర్ సర్కిల్ నాగారం డివిజన్ పరిధిలోని గోపి కృష్ణ కాలనీ సమీపంలోని హిందూ శ్మశాన వాటికలో నిబంధనలు పట్టించుకోకుండా దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియమాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత దహన సంస్కారాలు నిర్వహించరాదని ఉన్నప్పటికీ, కొందరు బాధ్యులు లంచాల కోసం నిబంధనలను అతిక్రమిస్తూ రాత్రి వేళల్లో కూడా దహనాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కాలనీవాసులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ మార్పు రాలేదని తెలిపారు. రాత్రి వేళల్లో దహనాలు జరగడంతో దుర్వాసన, పొగ కారణంగా ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోందని, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వాపోయారు. శనివారం సాయంత్రం కూడా నిబంధనలకు విరుద్ధంగా దహన సంస్కారం నిర్వహించేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న కీసర పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడి పరిస్థితిని సద్దుమణిగించారు. పోలీసులు సంబంధిత సిబ్బందికి నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, శ్మశానంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ పెంచాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

