60 ఫీట్ల రోడ్డు కబ్జా… బాత్రూమ్, మెట్లు నిర్మాణం…
- రోడ్డుపై అక్రమ కట్టడాలు… కాలనీవాసులకు ఇబ్బందులు
శంకర్ పల్లి, మార్చి 09(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో రోడ్లను ఆక్రమించి ఇష్టానుసారంగా కట్టడాలు నిర్మించడం పై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 60 అడుగుల రహదారిని ఆక్రమించి కొందరు గృహ యజమానులు బాత్రూం, మెట్లు నిర్మించడంతో రహదారి ఇరుకుగా మారిందని వారు తెలిపారు. కాలనీలో ఒక ఇంటి యజమాని నడిరోడ్డుపై బాత్రూం నిర్మించడంతో రోడ్డుపై ప్రయాణించే వారికి దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లక్షల రూపాయల వ్యయంతో వేసిన సీసీ రోడ్డును డ్రిల్లింగ్ యంత్రంతో తవ్వి నల్ల కనెక్షన్ కోసం పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి చర్యలపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గృహ యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా గృహాల వద్ద పార్కింగ్‌కు స్థలం వదలకుండా పూర్తిగా నిర్మాణాలు చేపట్టడంతో వాహనాలను రోడ్డుపైనే నిలిపివేయాల్సి వస్తోందని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.


