పెళ్లికి ముందు సెక్స్… నేరం కాదు
- కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన గాజుల తిరుపతి కేసులో సుప్రీం తీర్పు
- పెళ్లికి ముందు మేజర్లు ఇష్టపూర్వకంగా సంబంధం పెట్టుకుంటే తప్పుకాదన్న కోర్టు
- మారుతున్న కాలంలో ఇది సాధారణమైందన్న అత్యున్నత న్యాయస్థానం
- దీని ఆధారంగా క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమన్న కోర్టు
- ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశం
న్యూఢిల్లీ, జూన్ 8(ప్రజాక్షేత్రం):పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో జరిగిన శారీరక సంబంధాన్ని ప్రతి సందర్భంలోనూ తప్పుగా లేదా వ్యక్తి చెడు ప్రవర్తనగా పరిగణించలేమని సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ ఇచ్చింది. ప్రతి ప్రేమ బంధం పెళ్లి వరకూ వెళ్లకపోవచ్చని, కేవలం వివాహం జరగలేదనే కారణంతోనే మోసం జరిగిందని తేల్చలేమని పేర్కొంది. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థి నియామకానికి సంబంధించిన కేసులో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో కానిస్టేబుల్‌గా ఎంపికైన గాజుల తిరుపతిపై గతంలో నమోదైన కేసు కారణంగా అతని ఎంపికను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టి ఎస్ ఎల్ పి ఆర్ బి) రద్దు చేసింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు, ప్రేమ పేరుతో వివాహ హామీ ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకుని తర్వాత పెళ్లి చేసుకోలేదని ఆరోపణలు నమోదయ్యాయి. అయితే కేసులో తర్వాత రాజీ కుదిరిందని, ఆరోపణలు నిరూపితం కాలేదని, తనపై నమోదైన కేసు వివరాలను ముందుగానే వెల్లడించినప్పటికీ ఎంపిక రద్దు చేయడం అన్యాయమని అభ్యర్థి కోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యవహారం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. కేసును విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతో ఇద్దరు అవివాహితుల మధ్య జరిగిన సంబంధాన్ని వ్యక్తి నైతికతకు చెడు ముద్రగా చూడరాదని పేర్కొంది. నేటి సమాజంలో ప్రేమ సంబంధాలు సాధారణమని, ప్రతి ప్రేమ బంధం వివాహంతోనే ముగియాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే, పెళ్లి జరగలేదనే కారణంతోనే ఒకరు మరొకరిని మోసం చేశారని వెంటనే నిర్ణయించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. సంబంధం ప్రారంభం నుంచే మోసం చేసే ఉద్దేశం ఉందా లేదా పరిస్థితుల ప్రభావంతో వివాహం జరగలేదా అన్న అంశాలను ప్రతి కేసులో విడిగా పరిశీలించాల్సి ఉంటుందని వివరించింది. దీంతో గాజుల తిరుపతి ఎంపికను రద్దు చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసి, అభ్యర్థి నియామక అంశాన్ని తిరిగి పరిశీలించాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. వ్యక్తిగత ప్రేమ సంబంధాల ఆధారంగా ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయడం సముచితం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

