📄 ePaper
Sunday, September 20, 2026
📄 ePaper
Homeతెలంగాణబిడ్డ పుట్టాక పెళ్లి సర్టిఫికెట్…..గొట్లపల్లిలో రికార్డుల గందరగోళం!

బిడ్డ పుట్టాక పెళ్లి సర్టిఫికెట్…..గొట్లపల్లిలో రికార్డుల గందరగోళం!

📰 Generate e-Paper Clip

బిడ్డ పుట్టాక పెళ్లి సర్టిఫికెట్…..గొట్లపల్లిలో రికార్డుల గందరగోళం!

  • గొట్లపల్లి గ్రామ పంచాయతీలో మ్యారేజ్ సర్టిఫికెట్ వివాదం
  • వివాహానికి ముందే బిడ్డ జననం…..ఆ తర్వాత పెళ్లి సర్టిఫికెట్!?
  • ప్రభుత్వ రికార్డుల్లో తేదీల వ్యత్యాసం.. పంచాయతీ కార్యదర్శి పనితీరుపై ప్రశ్నలు
  • రికార్డుల నమోదు ప్రక్రియపై సమగ్ర విచారణకు డిమాండ్

పెద్దేముల్, సెప్టెంబర్ 14(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామపంచాయతీలో జారీ చేసిన ఓ మ్యారేజ్ సర్టిఫికెట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఒకే కుటుంబానికి సంబంధించిన వివాహ, జనన ధ్రువపత్రాల్లో నమోదైన తేదీల మధ్య వ్యత్యాసం ఉండటంతో అసలు రికార్డుల నమోదు ప్రక్రియ ఎలా సాగిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లోనే పరస్పర విరుద్ధమైన తేదీలు కనిపించడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తూ సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

ఒక రికార్డులో మార్చి 02.. మరో రికార్డులో జనవరి 30

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామానికి చెందిన బంటు అనిల్ కుమార్, మైల్వార్ గ్రామానికి చెందిన ఆకుల నందిని వివాహం 02-03-2026న జరిగినట్లు గొట్లపల్లి గ్రామపంచాయతీ పేరుతో జారీ చేసిన మ్యారేజ్ సర్టిఫికెట్‌లో నమోదైంది.ఈ సర్టిఫికెట్‌లో సీరియల్ నంబర్ 35గా ఉన్నట్లు సమాచారం. అయితే ఇదే జంటకు సంబంధించిన బిడ్డ 30-01-2026న తాండూరు ప్రభుత్వ మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో జన్మించినట్లు జనన ఈ-కార్డులో నమోదై ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ రెండు రికార్డుల్లోని తేదీలను పరిశీలిస్తే….బిడ్డ జననం జరిగిన తేదీకి సుమారు 32 రోజుల తర్వాత వివాహం జరిగినట్లు మ్యారేజ్ సర్టిఫికెట్‌లో నమోదై ఉంది. దీంతో వివాహ నమోదు ప్రక్రియ, ధ్రువపత్రాల జారీ సమయంలో సంబంధిత రికార్డులను ఎలా పరిశీలించారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

రికార్డుల పరిశీలన జరిగిందా?

మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ చేసే సమయంలో సంబంధిత పత్రాలు, వివరాలు, తేదీలను అధికారులు పరిశీలించారా? ఒకవేళ పరిశీలించి ఉంటే ఇలాంటి తేదీ వ్యత్యాసం ఎలా నమోదైంది? జనన ధ్రువపత్రం, వివాహ ధ్రువపత్రాల్లోని వివరాలు పరస్పరం ఎలా విభిన్నంగా నమోదయ్యాయి? అన్న అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం నమోదు చేశారా? లేక రికార్డుల నిర్వహణలో పొరపాటు జరిగిందా? అన్నది అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.

అధికారుల విచారణతోనే అసలు విషయం వెలుగులోకి

ప్రభుత్వ రికార్డుల్లో కనిపిస్తున్న తేదీల వ్యత్యాసంపై సమగ్రంగా విచారణ జరిపి అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎలాంటి తప్పిదం జరగకపోతే రికార్డుల ఆధారంగా స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.

ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణ చేస్తాం.

  • పెద్దేముల్ ఎంపీడీఓ కే.తిరుమల స్వామి

ఈ వ్యవహారంపై పెద్దేముల్ మండల ఎంపీడీఓ కే.తిరుమల స్వామిని వివరణ కోరగా….మండల పరిధిలోని గొట్లపల్లి గ్రామపంచాయతీలో మ్యారేజ్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించిన అంశంపై పూర్తిస్థాయిలో లోతుగా విచారణ చేపడతామని తెలిపారు. ధ్రువపత్రాల జారీలో ఏమైనా అవకతవకలు జరిగినట్లు తేలితే సంబంధిత వారికి నోటీసులు జారీ చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular