📄 ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
Homeరాజకీయంరంగారెడ్డి డీసీసీ పీఠం.. బడుగులకు మళ్లీ మొండిచేయేనా?

రంగారెడ్డి డీసీసీ పీఠం.. బడుగులకు మళ్లీ మొండిచేయేనా?

📰 Generate e-Paper Clip

రంగారెడ్డి డీసీసీ పీఠం.. బడుగులకు మళ్లీ మొండిచేయేనా?

  • పార్టీ కోసం శ్రమించిన బీసీ, ఎస్సీ నేతలను విస్మరించిన అధిష్ఠానం.
  • సామాజిక న్యాయం నినాదాలకే పరిమితం..
  • పదవులు మాత్రం ఒకే వర్గానికా?
  • అసంతృప్తి జ్వాలల్లో కాంగ్రెస్ బడుగు నేతలు..
  • క్షేత్రస్థాయిలో పెల్లుబుకుతున్న నిరసన‌.

శంకర్ పల్లి సెప్టెంబర్ 23(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి అంటూ నిరంతరం నినాదాలు చేసే అధికార కాంగ్రెస్ పార్టీ, క్షేత్రస్థాయి పదవుల పంపకానికి వచ్చేసరికి పాత పద్ధతినే అవలంబిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో ప్రాధాన్యత కలిగిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలిగా బడంగ్‌పేట మాజీ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డిని నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) అధికారిక ప్రకటన జారీ చేసింది. అయితే, ఈ నియామకం జిల్లా కాంగ్రెస్ లోని బడుగు, బలహీన వర్గాల నాయకుల్లో తీవ్ర నిరాశను, అసంతృప్తిని నింపింది. జిల్లా పీఠం కోసం ఎందరో బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు గట్టిగా ఆశలు పెట్టుకున్న తరుణంలో, అధిష్ఠానం మళ్లీ ‘రెడ్డి’ వర్గానికే పట్టం కట్టడం కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సామాజిక న్యాయం ఎక్కడ?రంగారెడ్డి జిల్లాలో వెనుకబడిన తరగతుల (బిసి), ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు అత్యంత బలంగా ఉంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వర్గాలే కాంగ్రెస్ పార్టీని ఇబ్బడిముబ్బడిగా ఆదరించాయి. ఈ నేపథ్యంలో ఈసారైనా డీసీసీ పీఠం బీసీ లేదా దళిత వర్గాలకు దక్కుతుందని ఆయా సామాజిక వర్గాల నేతలు గంపెడు ఆశలతో ఎదురుచూశారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో లాఠీ దెబ్బలు తిని, కేసులు ఎదుర్కొన్న బడుగు నేతలను పక్కనపెట్టి, కేవలం ఆర్థిక, సామాజిక అండదండలు ఉన్నాయనే సాకుతో ఒకే వర్గానికి మళ్లీ ప్రాధాన్యత ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక న్యాయం అనేది కేవలం ఎన్నికల వేదికలపై ప్రచార ఆయుధంగానే వాడుకుంటున్నారనే ఆవేదన ద్వితీయ శ్రేణి నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్గత పోరు.. అసంతృప్తి జ్వాలలుఈ నియామకానికి ముందు జిల్లాలోని బడుగు వర్గాల నేతలు కొందరు ఏకమై, తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర అధినాయకత్వానికి గట్టిగానే విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ పాత సమీకరణాలకే మొగ్గు చూపడం వల్ల జిల్లా కాంగ్రెస్‌లో నిశ్శబ్ద తిరుగుబాటు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాలు, మండలాల స్థాయిలో ఉన్న సీనియర్ బీసీ నేతలు నయా అధ్యక్షురాలికి ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఆమె జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి సమన్వయంపై చర్చించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని చల్లార్చడం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపే ప్రమాదంత్వరలోనే జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి కీలక సమయంలో బడుగు వర్గాల నేతలను నొప్పించడం పార్టీకి రాజకీయంగా నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. ప్రత్యర్థి పార్టీలు ఈ ‘సామాజిక వివక్ష’ అంశాన్ని ఆయుధంగా మార్చుకుని ప్రచారంలోకి వెళ్లే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక వర్గానికి మాత్రమే కొమ్ముకాస్తోందనే ముద్ర పడకుండా ఉండాలంటే, రాబోయే కమిటీలలోనైనా బీసీ, ఎస్సీ నేతలకు సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత అధిష్ఠానంపై ఉంది.
నినాదాలు బడుగుల కోసం.. పదవులు పాలకుల కోసం”అన్నట్లుగా సాగుతున్న ఈ రాజకీయ ధోరణి ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. నిరుత్సాహంలో ఉన్న బడుగు వర్గాల కార్యకర్తలను, నేతలను పారిజాత నర్సింహారెడ్డి ఏ విధంగా కలుపుకొని వెళ్తారో, అధిష్ఠానం చేసిన ఈ తప్పును ఎలా సరిదిద్దుకుంటారో వేచి చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular