- రెండు నెలల కన్నీళ్లకు.. తల్లిదండ్రుల నిరీక్షణకు తెర.
జగిత్యాల నవంబర్ 03(ప్రజాక్షేత్రం):తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ.. వారు తనను తీసుకెళ్లేందుకు వచ్చిన సమయంలో వారిని వదలలేక తల్లడిల్లిన చిన్నారి దృశ్యాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను కంటతడి పెట్టించాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియోపై నిన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. చిన్నారి కన్నీటి దృశ్యాలు చూసిన ప్రజలు వెంటనే ఆ బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించాలని కోరుతూ స్పందించారు. ఈ వీడియో అధికారుల దృష్టికి కూడా చేరడంతో వారు చలించిపోయారు. వెంటనే స్పందించిన జగిత్యాల జిల్లా కలెక్టర్.. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రకటించినట్లుగానే అధికారులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.
అర్ధరాత్రి తల్లిదండ్రుల చెంతకు చిన్నారి
దత్తత వివాదం కారణంగా మూడేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి తల్లిదండ్రులకు దూరమైంది. హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ అధికారుల జాప్యంతో చిన్నారి అప్పగింత వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో రెండు నెలలుగా తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. “అమ్మా.. భయమేస్తోంది.. నన్ను తీసుకెళ్లు” అంటూ చిన్నారి కన్నీటిపర్యంతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో స్పందించిన అధికారులు అర్ధరాత్రి కరీంనగర్ శిశు సంక్షేమ గృహం నుంచి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. రెండు నెలల తర్వాత బిడ్డ ఇంటికి చేరడంతో కుటుంబంలో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది.
సోషల్ మీడియా సాధించిన నిఖార్సైన విజయం
చిన్నారి కన్నీళ్లు.. తల్లిదండ్రుల ఆవేదన.. ప్రజల స్పందన.. అధికారుల తక్షణ చర్యలతో చివరకు బిడ్డ అమ్మ ఒడికి చేరింది. ఈ న్యాయపోరాటంలో తమకు అండగా నిలిచిన అడ్వకేట్ రఘునందన్ రెడ్డికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల గొంతుకగా మారిన ఈ ఘటన.. ప్రజల ఐక్య స్పందనతో ఒక చిన్నారి తన తల్లిదండ్రుల చెంతకు చేరిన నిఖార్సైన విజయంగా నిలిచింది.

