– రూ.5 లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల ప్రమాద బీమా..ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు
హైదరాబాద్ నవంబర్ 15(ప్రజాక్షేత్రం):గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక పథకాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. జయభేరి గ్రౌండ్స్‌లో నిర్వహించిన గిగ్ వర్కర్ల బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు కార్మికుల సంక్షేమ పథకాన్ని అమల్లోకి తెచ్చామని తెలిపారు. గిగ్ వర్కర్ల కష్టం, సమస్యలు తనకు తెలుసని, వారి హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పథకం ద్వారా అర్హులైన గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల ప్రమాద బీమాతో పాటు జీవిత బీమా, పింఛను, వైద్య సహాయం వంటి ప్రయోజనాలు కల్పించనున్నారు. ఓలా, ఉబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌లలో పనిచేసే కార్మికులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించి, సంక్షేమ బోర్డులో నమోదు చేయనున్నారు. కంపెనీలు ప్రతి లావాదేవీపై నిర్ణీత వాటాను సంక్షేమ నిధికి చెల్లించాల్సి ఉంటుంది. కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించడం, అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించకుండా రక్షణ కల్పించడం వంటి నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయి. నగరాల్లో కార్మికుల విశ్రాంతి కోసం రెస్ట్ హౌస్‌లు నిర్మించనున్నట్లు రాహుల్ వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర సమయంలో గిగ్ వర్కర్లకు ఇచ్చిన హామీని రాహుల్ గాంధీ నిలబెట్టుకున్నారని అన్నారు. ఆయన ఇచ్చిన మాట మేరకే ప్రత్యేక చట్టం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశామని తెలిపారు. గిగ్ వర్కర్లు, వారి కుటుంబాల ఆరోగ్యం, పిల్లల విద్యకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సభకు ముందు రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఉదయం నోవాటెల్ హోటల్‌లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశమై భారత్ సమ్మిట్ ఏర్పాట్లు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు. బైక్ ర్యాలీ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు.



