మొయినాబాద్లో చైర్మన్ కుర్చీ కోసం రాజకీయ కిడ్నాప్?
-హంగ్ ఫలితాల తర్వాత అడ్డదారి రాజకీయాలు ఆరోపణ
-బీఆర్ఎస్ నాయకుడు అల్లం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చేవెళ్ళ ఫిబ్రవరి 14(ప్రజాక్షేత్రం):మొయినాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో చైర్మన్ పదవి కోసం రాజకీయ పావులు కదులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో అడ్డదారులు తొక్కుతోందని బీఆర్ఎస్ నాయకుడు అల్లం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. చైర్మన్ కుర్చీ కోసం బీఆర్ఎస్ నుండి గెలిచిన కౌన్సిలర్లను రాత్రికి రాత్రే కాంగ్రెస్ నాయకులు తమ వైపు తిప్పుకునేందుకు ‘కిడ్నాప్ రాజకీయాలు’ ప్రారంభించారని మండిపడ్డారు. “ఇది రాజకీయ ఆకర్షణ కాదు… ఇది ప్రజాస్వామ్యాన్ని బందీ చేయడం” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రజల తీర్పుని దొంగిలించే కుట్ర!
“ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ను తిరస్కరించి బీఆర్ఎస్ను గెలిపించారు. అయినా చైర్మన్ సీటు కోసం సిగ్గులేకుండా మా కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇది ఓటర్ల గౌరవాన్ని అవమానించడం” అని అల్లం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో తీవ్ర అన్యాయం జరుగుతుండటంతోనే తాను బీఆర్ఎస్లో చేరానని గుర్తుచేస్తూ, ఇప్పుడు అదే అన్యాయ రాజకీయాలు మొయినాబాద్లో బయటపడుతున్నాయని విమర్శించారు.
ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎక్కడ?
ముఖ్యంగా ఇటీవల స్పీకర్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య పాత్రపై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. “బీఆర్ఎస్ అభ్యర్థులను ఇలా కిడ్నప్ చేస్తుంటే కాలే యాదయ్య ఎక్కడ ఉన్నారు? పార్టీ తరఫున స్పందన ఎందుకు లేదు?” అని ప్రశ్నించారు. మొయినాబాద్ రాజకీయాల్లో ఈ ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. చైర్మన్ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానిక రాజకీయాలను అగ్గిపెట్టెలా మారుస్తోంది.

