రాజేష్ లాకప్ డెత్ కేసు.. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి
-మంద కృష్ణ మాదిగ డిమాండ్
హైదరాబాద్ ఫిబ్రవరి 21(ప్రజాక్షేత్రం):సూర్యాపేట జిల్లా కోదాడలో పోలీస్ కస్టడీలో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతిపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. కోదాడ లాకప్ డెత్ బాధితుడు రాజేష్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్రేషియా ఇవ్వాలని, ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సామాజిక వర్గాన్ని కాపాడుతున్నారని ఆరోపించారు. అలాగే మాదిగలకు రాజ్యసభ సీటు కేటాయించాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, రాజేష్ లాకప్ డెత్ కేసు పై జాతీయ ఎస్సీ కమిషన్ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. దళితుల రక్షణకు జాతీయ ఎస్సీ కమిషన్ కట్టుబడి ఉందని సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ తెలిపారు. సీఐ సస్పెన్షన్, ఎస్ఐపై చర్యలు, 10 రోజుల్లో రీ-పోస్టుమార్టం చేయాలని అధికారులను ఆదేశించారు. కుటుంబానికి ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 3 ఎకరాల భూమి ఇవ్వాలని సూచించారు.

