📄 ePaper
Tuesday, February 24, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవనపర్తి అభివృద్ధికి వారానికో వార్డు పర్యటన.

వనపర్తి అభివృద్ధికి వారానికో వార్డు పర్యటన.

📰 Generate e-Paper Clip

వనపర్తి అభివృద్ధికి వారానికో వార్డు పర్యటన.

  • రూ.54 కోట్ల తో సీసీ రోడ్లు, 2000 ఇందిరమ్మ ఇళ్లు.
  • అవినీతికి తావులేకుండా అభివృద్ధి.
  • మరో 50 కోట్లు మంజూరు కు కృషి.
  • మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

వనపర్తి, ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):వనపర్తి పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని, వారానికి ఒక వార్డు చొప్పున సందర్శించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇందిరాపార్క్‌ నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ వివేకానంద చౌరస్తా, పాలిటెక్నిక్ కళాశాల, రాజీవ్ గాంధీ చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం మీదుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్‌గా మాధవి రమేష్, వైస్ చైర్మన్‌గా మధుసూదన్ గౌడ్‌తో పాటు మరో 20 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం చైర్మన్ మాధవి తన తొలి సంతకాన్ని మున్సిపల్ ఉద్యోగుల అలవెన్సుల ఫైల్‌పై, అలాగే తాగునీటి సమస్యల పరిష్కారానికి సంబంధించిన ఫైల్‌పై చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు నాలుగు రోడ్లు, రెండు చెరువుల కట్టలపై రెవెట్‌మెంట్లు నిర్మించి అదే అభివృద్ధిగా భావించారని విమర్శించారు. అభివృద్ధి గల్లీ నుంచి మొదలై ప్రధాన రహదారుల వరకు విస్తరించాలన్నారు. ప్రతి గల్లీని సందర్శించి సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.54 కోట్లతో ప్రతి వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అదనంగా రూ.50 కోట్లు వనపర్తి పట్టణానికి, రూ.20 కోట్లు పెబ్బేరు పట్టణానికి మంజూరు చేయించామని చెప్పారు. పట్టణ సుందరీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఇల్లు లేని పేదలకు గృహ స్వప్నాన్ని సాకారం చేసేందుకు వనపర్తికి 2000 ఇందిరమ్మ ఇళ్లు, పెబ్బేరుకు 500 ఇళ్లు మంజూరు చేయించామని వెల్లడించారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ల బాధ్యతలను తానే చూసుకున్నానని, ఇకపై ప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
నిధుల కొరత అనే మాట రానీయమని, అవసరమైతే తన స్వంత నిధులనూ వినియోగించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శక పాలన అందిస్తామని, ప్రజల మన్ననలు పొందేలా పని చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వ సుజాత, మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, ఎండి రహీం, మిడిదొడ్డి రమేష్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular