Homeతెలంగాణగండిపేట్ ఎక్స్‌ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

గండిపేట్ ఎక్స్‌ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

  • టాటా హారియర్‌ అదుపుతప్పి సిమెంట్‌ పైపులకు ఢీ
  • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ప్రత్యూష (32) మృతి.. స్నేహితులకు గాయాలు

మొయినాబాద్, అక్టోబర్ 31(ప్రజాక్షేత్రం):గండిపేట్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న యువతి మృతి చెందింది. నాగారం సురేందర్‌ కుమార్తె ప్రత్యూష (32) కోకాపేట్‌లోని పెప్సికో గ్లోబల్‌ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న స్నేహితులకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. అక్టోబర్‌ 30న మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు ప్రత్యూష విధులకు వెళ్లారు. అనంతరం స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్తున్నానని, ఇంటికి ఆలస్యంగా వస్తానని తండ్రికి తెలిపారు. అదే రోజు రాత్రి సుమారు 9.30 గంటలకు తండ్రితో వీడియో కాల్‌లో మాట్లాడారు.అక్టోబర్‌ 31న ఉదయం సుమారు 6.15 గంటలకు మొయినాబాద్‌ పోలీసులు ఫిర్యాదుదారుడికి ఫోన్‌ చేసి ప్రమాద విషయం తెలిపారు. ప్రత్యూష, ఆమె స్నేహితులు ప్రయాణిస్తున్న టాటా హారియర్‌ కారు (టీజీ 07 బీఫ్ 3607) గండిపేట్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద సిమెంట్‌ వాటర్‌ పైపులను ఢీకొట్టినట్లు సమాచారం ఇచ్చారు. ప్రమాదంలో ప్రత్యూషతో పాటు ఆమె స్నేహితులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న ప్రత్యూషను నానక్‌రామ్‌గూడలోని మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకున్న తండ్రికి అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో కారును కౌశిక్‌ నడుపుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular