- వలిగొండ పీహెచ్సీలో వైద్య సేవలపై విమర్శలు
వలిగొండ, నవంబర్ 10(ప్రజాక్షేత్రం):వలిగొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సమయానికి విధులకు హాజరు కావడం లేదన్న ఆరోపణలతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస ప్రాథమిక చికిత్స అందించేందుకు కూడా వైద్యులు అందుబాటులో ఉండటం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మేజర్ గ్రామపంచాయతీగా, ఎమ్మెల్యే సొంత గ్రామంగా గుర్తింపు పొందిన వలిగొండలోనే ప్రభుత్వ వైద్య సేవల పరిస్థితి ఇలా ఉంటే మారుమూల గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే పూర్తిస్థాయి వైద్య సేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల తనిఖీల సమయంలో మాత్రమే వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తున్నారని, సాధారణ రోజుల్లో సమయపాలన పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వైద్యుల హాజరు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) మనోహర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా సిబ్బంది సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.

