లారీ ఢీకొని రెండు కార్లు ధ్వంసం.. భార్యాభర్తలు, చిన్నారికి తీవ్ర గాయాలు
భువనగిరి, నవంబర్ 13(ప్రజాక్షేత్రం):యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామ సమీపంలో తీన్మార్ మల్లన్న పాదయాత్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోత్కూరు నుంచి తిరుమలగిరి వైపు పాదయాత్ర సాగుతుండగా గౌరెల్లి–కొత్తగూడెం ప్రధాన రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ మల్లన్న కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారును ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొనడంతో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. తిరుమలగిరికి చెందిన మేడబోయిన శ్రీనాథ్, ఆయన భార్య చందన, రెండేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ సురేష్‌తో పాటు మల్లన్న కారులో ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడినట్లు సమాచారం. లారీ ఢీకొట్టిన తీవ్రతకు ఫార్చునర్ కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో మల్లన్న కారులో కాకుండా కాలినడకన ముందుకు సాగుతుండటంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసుల సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

