– వేముల నర్వ గుప్తనిధుల కేసులో సంచలన మలుపు
– పది లక్షల ‘ఆఫర్’తో నోరు నొక్కే ప్రయత్నం!
– డబ్బులు ఇస్తామంటున్నారంటే.. నిధులు దొరికినట్లేనా?
– సర్పంచ్ భర్త, పంతుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం
– తప్పు చేయకపోతే సెటిల్మెంట్లు ఎందుకు? నిలదీస్తున్న ఊరి జనం
– అధికారుల మౌనం.. ఎమ్మెల్యేకు ఫిర్యాదు
కేశంపేట, మార్చి 22(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేముల నర్వ గ్రామంలోని చారిత్రక వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం ఇప్పుడు మరో సంచలన మలుపు తీసుకుంది. అక్రమంగా తవ్వకాలు జరిపి దొరికిపోయిన నిందితులు, ఇప్పుడు కేసును అణచివేయడానికి ‘నోట్ల కట్టలు’ ఎరవేస్తుండటం గ్రామంలో తీవ్ర కలకలం రేపుతోంది.
తప్పు ఒప్పుకున్నట్లేనా? రూ. 10 లక్షల ఆఫర్ వెనుక మతలబు ఏంటి?
ఆలయంలో తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్ భర్త మరియు స్థానిక పంతులు ఇప్పుడు గ్రామస్తుల కాళ్ల బేరానికి వస్తున్నట్లు సమాచారం. పోలీసు కేసును ఉపసంహరించుకోవాలని, ఎవరికీ తెలియకుండా సెటిల్ చేసుకుందామని, ఇందుకోసం రూ. 10 లక్షలు ఇస్తామని గ్రామస్తులకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో గ్రామస్తుల అనుమానాలు మరింత బలపడ్డాయి. “నిజంగా అక్కడ ఏమీ దొరకకపోతే, వీళ్ళు పది లక్షలు ఇవ్వడానికి ఎందుకు ముందుకు వస్తున్నారు?” అని గ్రామస్తులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో విలువైన నిధులు దొరికాయని, అందుకే ఆ విషయాన్ని తొక్కిపెట్టేందుకు ఈ భారీ ఆఫర్ ఇస్తున్నారని ఊరి జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సర్పంచ్ భర్త ‘అధికార’ దర్పం.. పంతుల ‘మాయాజాలం’
గ్రామ ప్రథమ పౌరురాలి భర్త హోదాలో ఉండి ఆలయాన్ని కాపాడాల్సింది పోయి, గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడంపై ప్రజలు మండిపడుతున్నారు. హైదరాబాద్ నుండి రహస్యంగా వ్యక్తులను పిలిపించి, పంతుల సలహాలతో దైవ కార్యమనే ముసుగులో ఈ దోపిడీకి తెరలేపారని ఆరోపణలు వస్తున్నాయి. గ్రామ పెద్దలకు, వార్డు మెంబర్లకు కనీస సమాచారం లేకుండా, దేవాదాయ శాఖ అనుమతులు లేకుండా ఇదంతా సాగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని స్పష్టమవుతోంది.
అధికారులు ఏం చేస్తున్నారు?
దేవాదాయ శాఖ ఈఓ (EO) మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. ఇంత బహిరంగంగా సెటిల్మెంట్లు జరుగుతున్నా, పది లక్షల ఆఫర్లు ఇస్తున్నా అధికారులు కదలకపోవడం వెనుక లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తేలాల్సిన నిజాలు:
ఆలయ గర్భాలయంలో తవ్విన గుంతల్లో ఏం దొరికింది?
దొరికిన నిధులను ఎక్కడికి తరలించారు?
కేసును నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్న సర్పంచ్ భర్తపై కఠిన చర్యలు తీసుకుంటారా?
“మా దేవుడి సొత్తును దోచుకుని, ఇప్పుడు మాకే డబ్బులు ఆశజూపి నోరు నొక్కాలని చూస్తే ఊరుకోం” అని వేముల నర్వ గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, సర్పంచ్ భర్త మరియు పంతులపై పకడ్బందీగా విచారణ జరిపి, వాస్తవాలను బయటపెట్టాలని గ్రామం ముక్తకంఠంతో కోరుతోంది.
అధికారుల మౌనం.. ఎమ్మెల్యేకు ఫిర్యాదు.
దేవాదాయ శాఖ ఈఓ (EO) వ్యవహారశైలిపై కూడా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయా అన్న సందేహాలను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హామీతోనైనా ఉన్నతాధికారులు కదిలి, సర్పంచ్ భర్త మరియు పంతులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, వాస్తవాలను బయటపెట్టాలని వేముల నర్వ గ్రామం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది.

