📄 ePaper
Saturday, April 11, 2026
ads
📄 ePaper
Homeఆర్టికల్స్దామగుండం అడవిలో 12 లక్షల చెట్లు నరికివేత..

దామగుండం అడవిలో 12 లక్షల చెట్లు నరికివేత..

📰 Generate e-Paper Clip

దామగుండం అడవిలో 12 లక్షల చెట్లు నరికివేత..

  • లోఫ్రీక్వెన్సీ రాడార్‌ కేంద్రం ఏర్పాటుతో చెట్లు నరికివేత
  • లక్షల పక్షులు అంతర్థానం
  • మూసీ నదీ ప్రవాహం తగ్గే ప్రమాదం..
  • రేడియేషన్‌ ప్రభావం ఉంటుందంటున్న నిపుణులు
  • ముమ్మరంగ నేవీ లోఫ్రీకెన్వీ రాడార్‌ కేంద్రం పనులు

వికారాబాద్‌ కా హవా.. లాకోఁ మరీజోఁకా దవా’ అని నానుడి. వికారాబాద్‌ అడవుల గాలి తగిలితే.. ఎలాంటి రోగమైనా మాయమై పోతుందని పెద్దలు చెప్తారు. అనేక ఔషధ మొక్కలకు, అద్భుత ప్రకృతి సంపదకు నిలయమైన వికారాబాద్‌ అడవులు ఇప్పుడు మాయమవ్వబోతున్నాయి. నేవీ లోఫ్రీకెన్వీ రాడార్‌ కేంద్రం ఏర్పాటుతో 12 లక్షల చెట్లు మాయమవనున్నాయి. లక్షల పక్షులు అంతర్ధానమవనున్నాయి. ఇక్కడే జన్మించే మూసీ నది కూడా ప్రమాదంలో పడబోతున్నది.
వికారాబాద్ అడవుల్లోనే పుట్టే మూసీ నది ప్రమాదంలో పడబోతున్నది. మూసీకి జలధారలు అందించే దామగుండం అడవులు కనుమరుగు కానున్నాయి. రాడార్‌ సెంటర్‌ కోసం ఇక్కడ అక్షరాలా 12 లక్షలకుపైగా వృక్షాలను నరికివేయనున్నారు. అభివృద్ధి పేరుతో రిజర్వ్‌ ఫారెస్ట్‌ చుట్టూ సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు వేస్తున్నారు.
వీటన్నింటికన్నా అతిపెద్ద సమస్య రేడియేషన్‌. వీఎల్‌ఎఫ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం వల్ల రేడియేషన్‌ బాగా పెరుగుతుందని, దీనివల్ల చుట్టూ కనీసం 30 కిలోమీటర్లు.. గరిష్ఠంగా 60 కిలోమీటర్ల పరిధిలో నివసించేవారి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ప్రజలు వ్యతిరేకించటంతో వీఎల్‌ఎఫ్‌ టెక్నాలజీ కేంద్రాన్నే తీసివేశారని గుర్తు చేస్తున్నారు.
మనదేశంలో కూడా ఇతర రాష్ట్రాలేవీ వీఎల్‌ఎఫ్‌ కేంద్రం ఏర్పాటుకు అనుమతివ్వలేదని చెప్తున్నారు. భూ పరివేష్టిత ప్రాంతంలో వీఎల్‌ఎఫ్‌ కేంద్రం ఏర్పాటు చేయడాన్ని కూడా పర్యావరణవేత్తలు తప్పుపడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2,900 ఎకరాల అటవీ భూమిని నౌకాదళ అధికారులకు అప్పగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నౌకాదళ అధికారులకు భూ పత్రాలను అందజేశారు.

12,12,753 చెట్ల నరికివేత
పచ్చదనానికి తెలంగాణ పర్యాయపదంగా మారిందని గణాంకాలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టంచేశాయి.

ఇప్పుడు రాడార్‌ కేంద్రం ఏర్పాటుతో అక్షరాలా 12 లక్షల 12 వేల 753 వృక్షాలను నరకాల్సి వస్తున్నది. ఇవి ఆషామాషీ చెట్లు కావు. ప్రకృతి సిద్ధంగా వందల సంవత్సరాలుగా ఏర్పడ్డ చెట్లు ఇవి. వీటిని ఇప్పుడు నాటడమన్నది సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ నాటినప్పటికీ ఇవి పెరిగి పెద్దవి అయ్యేందుకు వందల సంవత్సరాలు పడుతుంది.

ఇవి ఇచ్చే పండ్లు, మంచిగాలికి వెలకట్టలేం. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు వికారాబాద్‌ ప్రాంతానికి విహారయాత్రకు వస్తుంటారు. ఇక్కడి దట్టమైన అడవి, ఆ అడవి నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలికి తిరుగులేదు. ‘వికారాబాద్‌ కా హవా.. లాకో మరీజోకా దవా’ అనే నానుడి ఉన్నది. అంటే వికారాబాద్‌ ప్రాంతంలోని అడవుల నుంచి వచ్చే స్వచ్చమైన గాలి లక్షలాది రోగాలకు మందులా పనిచేస్తుందని చెప్తుంటారు.
నిజాం నిజాంనవాబు హైదరాబాద్‌ను పాలిస్తున్న సమయంలో అనంతగిరి అడవుల్లో ప్రత్యేకంగా రోగుల కోసమే ఒక వైద్యశాలను ఏర్పాటు చేసినట్టు చరిత్రకారులు సైతం చెప్తుంటారు. టీబీ, ఛాతి వ్యాధులున్నవారు ఇక్కడికి వస్తే రోగాలు నయం అవుతాయని శాస్త్రీయంగా కూడా రుజువయ్యింది. ఇక్కడి అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కలు విరివిగా లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు కూడా ఔషధ మొక్కల నర్సరీలను కూడా ఏర్పాటు చేశాయి.

దేశంలోని అనేక ప్రాంతాలకు ఇక్కడి ఔషధ మొక్కలను రవాణా చేస్తుంటారు. నౌకాదళం రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో తాము కొట్టివేసే చెట్లకు ప్రత్యామ్నాయంగా 12 లక్షల మొక్కలు నాటుతామని హామీ ఇచ్చింది. ఒకవేళ వీళ్లు కొత్తగా నాటినా వాటిని వికారాబాద్‌లోనే పెట్టే అవకాశం లేదు. మన చట్టాల్లో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకొని ఎక్కడైనా మొక్కలు నాటవచ్చు.

ప్రమాదంలో 175 పక్షిజాతులు
వికారాబాద్‌ అటవీ ప్రాంతంలోని దామగుండం పరిసరాల్లో అరుదైన వ్యన్యప్రాణులు అనేకం ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం 175 రకాల పక్షిజాతులు ఇక్కడ జీవం పోసుకుంటున్నాయి. రాష్ట్ర రాజధానికి అతి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతానికి అనేక మంది పక్షి ప్రేమికులు వస్తుంటారు. దుప్పులు, జింకలు, కుందేళ్లు, అడవి పందులు.. ఇలా అనేక రకాల జంతుజాలం కూడా ఇక్కడ ఉన్నది. రాడార్‌ కేంద్రాన్ని నిర్మిస్తే ఇవన్నీ అంతరించిపోతాయి. దీనిపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.గ్రామపంచాయతీలో తీర్మాన పత్రంపై సంతకాలు చేశారు.

వీఎల్‌ఎఫ్‌ కేంద్రంలో ఏం చేస్తారు?

సముద్రంలో, సముద్రగర్భంలో ఉండే భారత రక్షణ నౌకలు, జలంతర్గాములను పర్యవేక్షించటానికి ఈ కేంద్రానికి ఏర్పాటుచేస్తున్నారు. వెరీ లో ఫ్రీక్వెన్స్‌ రాడార్‌ సిస్టం దీని కోసం ఉపయోగిస్తారు. తరంగాలను ఉపయోగించి సముద్రంలో రాకపోకలు సాగించే నౌకల గమనాన్ని పరిశీలిస్తారు. ఈ రాడార్‌ కేంద్రాన్ని ఇక్కడే ఏర్పాటు చేయాలనేమీ లేదు. గతంలో ఇదే తరహా కేంద్రాన్ని కేరళలో పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారని పర్యావరణవేత్తలు చెప్తున్నారు.

తరంగాలను పంపడమంటే రేడియేషన్‌ ప్రభావం కచ్చితంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీనిపై స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించలేదు. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొన్నది. చుట్టుపక్కల గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటివరకు అలాంటి ప్రయత్నమే చేయలేదు. దామగుండం గ్రామం ఉన్న పూడూరు పంచాయతీ తీర్మానాన్ని మాత్రమే తీసుకున్నారు. చుట్టుపక్కల కనీసం 25 గ్రామాలున్నాయి. ఆ గ్రామాలవారికి రాడార్‌ కేంద్రంపై కనీస అవగాహన లేదు. తమ గ్రామాల్లో గ్రామసభలు పెట్టకుండా ఎలా అడవులను అప్పగిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మూసీకి నీళ్లు ఎలా?

మూసీ నది జన్మస్థానం వికారాబాద్‌ అడవులు. మూసీ నది జన్మస్థానం వద్ద ఉండే అనంతగిరి వద్ద రెండువైపులా అడవులుంటాయి. ఒకవైపు దామగుండం, మరోవైపు అనంతగిరి అడవులుంటారు. మూసీనదికి ఏర్పడే నీటి ఊటలు దామగుండంలో కూడా ఉన్నాయి. ఇక్కడ వేసవి కాలంలో కూడా నీటి ప్రవాహాలు కనిపిస్తుంటాయి. ఇక్కడి నీటి ఊటలు, చిన్నచిన్న పాయల సమూహమే మూసీగా రూపాంతరం చెందుతుంది. అలాంటిది ఇప్పుడు ఇక్కడి చెట్లను నరికివేసి రాడార్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తే నీటి ఊటలు మాయమవుతాయి. మూసీకి నీళ్లు రావ డం కూడా కష్టమే అవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఎం రవీందర్
సీనియర్ జర్నలిస్టు
7901503777

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular