2వ దశలో 45రోజుల తర్వాత జిల్లాకో మండలంలో సమీకృత భూభారతి
- ప్రతి జిల్లాలోని 70 గ్రామాల్లో పూర్తిస్ధాయి సర్వే
- ప్రతి సర్వే నెంబర్‌కు భూధార్
- వీలైనంత త్వరగా సాదాబైనామాలకు పరిష్కారం
- ఎన్నికల్లో ఫలితాలు చూసినా జ్ఞానోదయం కలగలేదు
- అసెంబ్లీలో టెర్రరిస్టుల్లా ప్రవర్తించారు.
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎప్రిల్ 02(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను 45రోజుల పాటు పరిశీలించి తర్వాత అవసరమైన మార్పులు, చేర్పులతో జిల్లాకొక మండలంలో ప్రవేశపెడతామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. గురువారం నాడు రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలోని మిఠాయిపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను మంత్రి పొంగులేటి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో గురువారం అమనగల్ మండలంతో పాటు ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కొస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏ పేదోడు ఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఏ అధికారి దగ్గరికి వెళ్లి ప్రాధేయపడవలసిన అవసరం లేదు తన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ లో లాగిన్ అయితే అన్ని సేవలు లభిస్తాయని అన్నారు. గత ప్రభుత్వ పాలకులు ప్రవేశపెట్టిన ధరణి కారణంగా రాష్ట్రంలో 9.52 లక్షల సాదాబైనామా దరఖాస్తులకు దిక్కులేకుండా పోయిందని ఇప్పుడు ఈ పేదల ప్రభుత్వం దీనిపై దృష్టి సారించిందని తెలిపారు. సాగుచేస్తూ, వారి అధీనంలో ఉండే భూములకు సంబంధించి సదరు వ్యక్తి వద్ద కన్సెంట్ తీసుకొని వారికే భూమి పట్టాను ఖరారు చేస్తామని దీనికోసం వారం రోజుల క్రితం భూభారతిలో సవరణ చేస్తూ జీవో జారీ చేశామని వెల్లడించారు. అంతేగాక గతంలో గ్రామంగా ఉండి ఇప్పుడు మున్సిపాల్టీగా మారిన ప్రాంతాలకు ఈ సాదాబైనామాలు వర్తించేలా చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ప్రజల కోసం తమ రెవెన్యూశాఖలో గణనీయమైన మార్పులు తెస్తున్నామని దీనిలో్ భాగంగా అక్రమాల ధరణిని చెప్పినట్లే బంగాళాఖాతంలో కలిపి భూభారతి తెచ్చామని, ఆధార్ నెంబర్‌లా ప్రతి భూమికి భూధార్ నెంబర్‌ను కేటాయిస్తామని చెప్పారు. అంతేగాక రాష్ట్రంలో 10.984 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా విభజించి జీపీవోలను నియమించడం జరిగింది. 5300 మందికి రెండు విడతల్లో ఆరునెలల పాటు శిక్షణ ఇచ్చి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించామని తెలిపారు. సర్వే విషయంలో కూడా పాత పద్దతులకు స్వస్తి పలికి ఇప్పటికే 411 రోవర్లతో కచ్చితమైన సర్వే చేయిస్తున్నామని, త్వరలో మరో 400 రోవర్లు రాబోతున్నాయని తెలిపారు. పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వ పనిచేస్తుంటే గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన వ్యక్తులు ఇప్పుడు శాసనసభ సాక్షిగా విషం కక్కారని, టెర్రరిస్టుల్లా ప్రవర్తించారని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు. ప్రతి ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఇంకా జ్ఞానోదయం కాలేదని అన్నారు. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయ భవనాలకు త్వరలో తాను శంకుస్ధాపన చేస్తానని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి లోకేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

