చిత్తడిగా పాఠశాల దారి.. విద్యార్థుల అవస్థలు
శంకర్‌పల్లి, జూలై 30(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాల, ప్రాథమిక పాఠశాల, మోడల్ స్కూల్‌కు వెళ్లే రహదారి వర్షపు నీటితో పూర్తిగా చిత్తడిగా మారింది. రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే సుమారు వెయ్యి మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటిని దాటుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గుంతలను లెవెలింగ్ చేసి మొరం పోయించి రహదారిని ప్రయాణయోగ్యంగా మార్చాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వారు కోరుతున్నారు.

