📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణకారోబార్‌పై దాడి.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి

కారోబార్‌పై దాడి.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి

📰 Generate e-Paper Clip

కారోబార్‌పై దాడి.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి

  • కులం పేరుతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • ఎమ్మార్పీఎస్‌ వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ డిమాండ్

పెద్దేముల్, సెప్టెంబర్ 04(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ కారోబార్‌ శ్రీనివాస్‌ మాదిగపై కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొండాపూర్ గ్రామ కారోబార్‌ శ్రీనివాస్‌ తన విధుల్లో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలకు సంబంధించి నోటీసులు జారీ చేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడి, కులం పేరుతో దూషించినట్లు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు పెద్దేముల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఘటన స్థలాన్ని పరిశీలించిన తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య

శుక్రవారం ఉదయం తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, స్థానిక ఎస్‌ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ సంఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించి, ఘటన స్థలంలో సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ నాయకులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం, కులం పేరుతో దూషించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని మల్లికార్జున్ మాదిగ అన్నారు. బాధితుడు శ్రీనివాస్‌కు న్యాయం జరిగేలా పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి

కుల వివక్షకు తావులేకుండా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు డిమాండ్ చేశారు.బాధితుడికి, ఆయన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు.కేసు దర్యాప్తును వేగవంతం చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకులు గుట్టకింది రవికుమార్ మాదిగ, చిట్టిగిద్ద కిష్టయ్య మాదిగ, పెద్దేముల్ మండల నాయకులు భరత్ మాదిగ, తాండూరు మండల ఉపాధ్యక్షుడు వెంకట్ మాదిగ, కొండాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కోడి అశోక్ మాదిగ, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular