📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణభట్టి భార్య వసూళ్లు… పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా?!!

భట్టి భార్య వసూళ్లు… పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా?!!

📰 Generate e-Paper Clip

భట్టి భార్య వసూళ్లు… పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా?!!

హైదరాబాద్ సెప్టెంబర్ 03(ప్రజాక్షేత్రం):మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ నాయకత్వానికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క భార్య వసూళ్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దౌర్జన్యాలు కనిపించడంలేదా?* అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే, ప్రజల సొమ్ము లూటీ జరుగుతుంటే తన కుమార్తె ప్రశ్నించినందుకు తనకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడమేంటని మండిపడ్డారు. పార్టీలో క్రమశిక్షణ చర్యలంటూ మొదలుపెడితే ముందుగా సీఎం రేవంత్‌రెడ్డి నుంచే ప్రారంభం కావాలి అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ పైనా వివక్ష చూపుతున్నారని, హైదరాబాద్‌ ఇన్‌చార్జి అయినప్పటికీ.. ఎక్కడా ఆయన ఫొటో ఉండనివ్వరని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ పదవిపై కూడా రేవంత్‌రెడ్డి కన్నేశారని ఆరోపించారు. తెలంగాణలో బీసీలు అంత ఈజీగా ఏం లేరని హెచ్చరించారు. ఢిల్లీలోని గాంధీ భవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో కొండా సురేఖ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ”కేసీ వేణుగోపాల్‌ను కలవడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ఖర్గే కూడా ఎంతో సమయం ఇవ్వలేదు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు, నాపై జరుగుతున్న కుట్రలన్నింటినీ వివరిస్తూ సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌లకు సుదీర్ఘమైన లేఖ పంపాను. ఆ లేఖను బయటకు విడుదల చేస్తే తట్టుకోలేరు. అయినా నేను ప్రశాంతంగా ఉంటూ అధిష్ఠానానికి నా ఆవేదన చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాను” అని కొండా సురేఖ వివరించారు.

ముఖ్యమంత్రి ఎందుకు ఖండించడంలేదు?!

పొంగులేటి కొడుకు కబ్జాలను, భట్టి విక్రమార్క భార్య వసూళ్లను ముఖ్యమంత్రి ఖండించడం లేదంటే.. వాటిని అంగీకరించినట్లే కదా అని సురేఖ అన్నారు. ”ఉప ముఖ్యమంత్రి భట్టి భార్యపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దోపిడీ ఏ స్థాయిలో ఉందో అందరూ చూస్తున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని రూ.50 కోట్లకు కొనుక్కున్నారని కోమటిరెడ్డి గతంలో ఆరోపించారు. వారిపై లేని క్రమశిక్షణచర్యలు నాపైనే ఎందుకు? అసలు రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థులను ముందే ప్రకటించే హక్కు ఎక్కడిది? కాంగ్రెస్‌ పార్టీలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవారిపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా రేవంత్‌రెడ్డి నుంచే మొదలుపెట్టాలి” అని సురేఖ అన్నారు. జగ్గారెడ్డి అంటే రేవంత్‌కి భయమని, అందుకే ఆయన భార్యకు మళ్లీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని చూస్తున్నారని తెలిపారు. ”నేను ఏ తప్పు చేశానో చెబితే సమాధానం చెబుతా నా కూతురికి కొన్ని భావాలు, ఆశయాలు ఉన్నాయి. తనూ ఎమ్మెల్యే కావాలనుకుంటోంది. నాకంటే పార్టీలోకి ఆలస్యంగా వచ్చిన కడియం శ్రీహరి బిడ్డను వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి ఎంపీని చేశారు. మరి మీరేం చేస్తున్నారని మా బిడ్డ ప్రశ్నిస్తే మేము ఏమని సమాధానం చెప్పాలి? మీరు బీసీలకు కనీసం చైర్మన్‌ పదవి కూడా తెచ్చుకోలేనప్పుడు.. ఇక నన్ను ఎమ్మెల్యేను ఎలా చేస్తారని ఆమె నిలదీస్తోంది. అందుకే నేను స్వతంత్రంగా నా నిర్ణయాలు నేను తీసుకుంటాని చెబుతోంది. గతంలో ధర్మపురి శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడే ఆయన కుమారుడు అరవింద్‌ ఇష్టానుసారంగా మాట్లాడారు. మరి అప్పుడు డి.శ్రీనివాస్ కు కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? పరకాల ప్రభాకర్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గానీ, ఆ పార్టీ నేతలనుగానీ విమర్శిస్తే నిర్మలా సీతారామన్‌కు ఏమైనా నోటీసులు ఇస్తారా? నేను స్వయంగా మాట్లాడితే నాకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంలో అర్థం ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి నేరుగా టికెట్లు ప్రకటించిన రేవంత్‌రెడ్డికి నోటీసులు ఇవ్వరా?” అని సురేఖ ప్రశ్నించారు.

అవి కాంగ్రెస్‌ నేతల మనసులోని మాటలే..

ప్రెస్‌మీట్‌ పెట్టి తనపై విమర్శలు చేసిన నాయకులంతా తనతో మాట్లాడిన వారేనని సురేఖ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమని చెబుతూనే.. టీడీపీనేతలను తీసుకొచ్చి కీలక స్థానాల్లో కూర్చోబెడుతున్నారని, దీనివల్ల అసలైన కాంగ్రెస్‌ కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాయకులందరి మనసుల్లో ఉన్న మాటే తన బిడ్డ మాట్లాడిందని, బయటకు చెప్పకపోయినా లోపల అందరూ సంతోషంగానే ఉన్నారని పేర్కొన్నారు. బీసీలందరూ తమ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌ తెచ్చిన ఒత్తిడిని తట్టుకోలేకనే మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనపై మాట్లాడారే తప్ప.. మిగతా మంత్రులెవరూ స్పందించలేదు అన్నారు. తన వద్ద పనిచేసే మాజీ ఓఎస్టీ నోరు తెరిస్తే అందరి భాగోతాలు బట్టబయలవుతాయని, అందుకే పొంగులేటి టార్గెట్‌ చేసి అతణ్ణి అరెస్టు చేయించారని ఆరోపించారు. డబ్బులు వసూలు చేసినోడి పక్షానే పోలీసులు నిలిచారని, చివరికి తాము మోసపోయామంటూ కొందరు స్టేషన్‌కు వెళితే వారిపైనే కేసులు పెట్టారని ఆరోపించారు.

చర్యలు తీసుకుంటే తీవ్ర పర్యవసానాలు..

తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందులు తప్పవని సురేఖ హెచ్చరించారు. పార్టీ అధిష్ఠానం తనను రాజీనామా చేయమని అడగదని భావిస్తున్నట్లు చెప్పారు. ”ఒకవేళ రాజీనామా చేయాలని నాపై ఒత్తిడి తెస్తే.. అసలు ఎందుకు చేయాలని ప్రశ్నిస్తా. ఆ సమయంలో ఏ విషయాలు అడగాలో స్పష్టత ఉంది” అని అన్నారు. ఇప్పటివరకు తనను ఎవరూ రాజీనామా చేయమని కోరలేదని, ఒకవేళ అడిగితే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులు, చేర్పుల్లో భాగంగా బీసీ, ముస్లిం, లేదా ఎస్సీ వర్గాలకు చెందిన ఎవరిని తీసుకుంటారో చూడాల్సి ఉందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular