రాంపల్లిలో రూ.5 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
- రాంపల్లిలో యూజీడీ పనులకు శంకుస్థాపన
నాగారం, సెప్టెంబరు 16(ప్రజాక్షేత్రం):మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్ రాంపల్లిలో పలు కాలనీలకు మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ శంకుస్థాపన చేశారు. కాలనీల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేలా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతంలోని పలు సమస్యలను వజ్రేశ్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. రహదారులు, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు. 1000 రోజుల పాలనలో నియోజకవర్గ పరిధిలో రూ.300 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వజ్రేశ్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తూ కాలనీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌకుట్ల జీవన్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

